Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు : నేటికీ 55 ఏళ్లు .. మళ్లీ అదే సీన్ ?

By:  Tupaki Desk   |   15 Oct 2021 1:39 PM GMT
విశాఖ ఉక్కు : నేటికీ 55 ఏళ్లు .. మళ్లీ అదే సీన్ ?
X
ఉత్తరాంధ్రలో ప్రస్తుతం సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదం మారుమోగుతోంది. విశాఖ ఉక్కు ఉత్రరాంధ్ర హక్కు అంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. ప్రజల్లో బలమైన సెంటిమెంట్ ఉండడంతో పార్టీలకు అతీతంగా నేతలంతా విశాఖ ఉద్యమాన్ని భుజాన వేసుకునేందుకు మేము సైతం అంటున్నారు.. కానీ ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణం అంత ఈజీగా జరగలేదు. 32 మంది ప్రాణాలు అర్పించారు. జాతీయ నేతలకు నిద్ర పట్టకుండా విశాఖ ఉక్కు ఆంధ్రా హక్కు అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు. మళ్లీ ఇప్పుడు ఉక్కు ఉద్యమం ఎగసి పడుతుంది.

దాదాపు 50 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మొదలైంది. సరిగ్గా ఇదే రోజున అంటే ఇప్పటికి యాభై అయిదేళ్ల క్రితం 1966 అక్టోబర్ 15న విశాఖ కలెక్టరేట్ ఎదుట స్వాతంత్ర సమరయోధుడు అమృతరావు ఉద్యమ బాట పట్టారు. విశాఖకు ఉక్కు కర్మాగారం రావాల్సిందే అంటూ ఆయన అమరణ నిరాహార దీక్షను చేపట్టారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఆందోళనకారులు నినదిస్తున్నారు.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు.. ఆరుగురు ఉద్యమకారులు మరణించారు.. అదే రోజు ఒక్క విశాఖలోనే కాకుండా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసుల కాల్పుల్లో మొత్తం 32 మంది ప్రాణాలు అర్పించారు. ఆ విషాద ఘటన జరిగిన మూడేళ్ల తరువాత కేంద్రం ప్రభుత్వం విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 1971లో శంకుస్థాపన జరిగితే, రెండు దశాబ్దాల తరువాత పూర్థిస్థాయి ఉక్కు పరిశ్రమ పనులను ప్రారంభమయ్యాయి.

మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన తరువాత.. మద్రాసు నగరాన్ని కోల్పోయామన్నఅసంతృప్తి ప్రజల మనసునుంచి చెరిగిపోలేదు. దానికి తోడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అన్యాయమే జరిగిందని ఆంధ్ర ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు నాలుగో పంచవర్ష ప్రణాళికలో అదనంగా రెండు ఉక్కు కర్మాగారాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పటికే ఉత్తర భారతదేశంలో ఒడిశాలో రూర్కెలా, మధ్యప్రదేశ్లో భిలాయ్, పశ్చిమబెంగాల్ లో అసన్ సోల్ ఇలా మూడు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. కొత్తగా నిర్మించాలనుకున్న స్టీల్ ప్లాంట్లలో ఒకటి.. అంటే నాలుగోది బొకారో లో నెలకొల్పాలని నిర్ణయించారు. బొకారో ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది. ఐదో కర్మాగారాన్ని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలన్నది అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆలోచన.

1964 శీతాకాల సమావేశాల్లో ఆ ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ సందర్భంగా పరిశ్రమల విషయంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి అని ఏపీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్నిఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని అప్పటి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు సీపీఐకు చెందిన పి.వెంకటేశ్వర్లు, సీపీఎం కు చెందిన టి.నాగిరెడ్డి, స్వరాజ్య నేత జి.లచ్చన్న, నేషనల్ డెమొక్రాట్స్ నేత తెన్నేటి విశ్వనాథం, ఇండిపెండెంట్ నేత వావిలాల గోపాల కృష్ణయ్య ఇతర నేతలు మద్దతు ఇచ్చారు.

అప్పటికే ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం చేసిన హిందుస్తాన్ స్టీల్ మాత్రం విశాఖపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలం కాదని నివేదిక ఇచ్చింది. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉక్కు కర్మాగారం బలమైన సెంటిమెంట్ గా మారింది. తెన్నేటి విశ్వనాథం సారథ్యంలో.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం బలమైన అఖిలపక్ష కార్యాచరణ కమిటీ ఏర్పడింది. అప్పటికే నివేదిక ఆధారంగా విశాఖలో ఉక్క కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్రానికి బలంగా తమ వాదన వినిపించారు. అప్పటి ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి సైతం విశాఖలో ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కానీ ఆయన 1966 జనవరిలో ఆకస్మికంగా చనిపోయారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరా గాంధీ ప్రభుత్వం కర్నాటలోని హోస్పేటలో పెట్టాలని నిర్ణయించింది. దాంతో ఉమ్మడి ఏపీ అంతా ఆనాడు ఉద్యమ సెగలు చెలరేగాయి. ఉక్కు సంకల్పంతో ఉవ్వెత్తిన కడలి తరంగాలను మించి ఆవేశం లేచింది.

మరో వైపు చూస్తే సరిగ్గా 55 ఏళ్ల తరువాత మళ్లీ ఉక్కుని కాపాడుకోవడం కోసం మరో ఘనమైన ఉద్యమం సాగుతోంది. ఇప్పటికి 250 రోజులుగా విశాఖలో ఉక్కు కార్మికులు ఆందోళన నిరంతరాయంగా చేస్తూనే ఉన్నారు. కేంద్రం విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమృతరావు ఇచ్చిన స్పూర్తితో మరింతగా ఉద్యమించడానికి కార్మిక లోకం సిద్ధంగా ఉంది. విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి ఆంధ్రూలంతా ఒక్కటి కావాలని స్టీల్ కార్మిక లోకం పిలుపు ఇస్తోంది.


1970 ఏప్రిల్ 17న.. విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పార్లమెంటులో ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు.డీపీఆర్ తయారీ బాధ్యతను మెస్సర్స్ ఎం.ఎన్.దస్తూర్‌ అండ్ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌ లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో 1,000 కోట్లు మంజూరు చేయటంతో పనులు మొదలయ్యాయి. ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1982 జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. అలా ప్రారంభమైన ఉక్క పరిశ్రమ ఇప్పుడు 26 వేల ఎకరాల్లో విస్తరించింది. ప్రతి ఏడాది 7.3 మిలియన్‌ టన్నులు ఉక్కును ఉత్పత్తి చేస్తోంది. సుమారు 16 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 17 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా.. లక్షలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. కొన్నేళ్ల పాటు లాభాలు అందించిన స్టీల్ ప్లాంట్ ను.. ఇప్పుడు నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదనలతో మళ్లీ ఉక్కు ఉద్యమం ఎగసిపడుతోంది.