Begin typing your search above and press return to search.

500 రోజుల పోరాటం : ఇరవై కిలోమీటర్ల భారీ ర్యాలీ

By:  Tupaki Desk   |   26 Jun 2022 11:30 AM GMT
500 రోజుల  పోరాటం :  ఇరవై కిలోమీటర్ల భారీ ర్యాలీ
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ గత ఏడాది ఫిబ్రవరి 28న విశాఖ వేదికగా మొదలెట్టిన విశాఖ ఉక్కు ఉద్యమకారుల పోరాటం 500 రోజుల మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం పచ్చని విశాఖ కాస్తా అరుణ వర్ణ శోభితం అయింది ఎటు చూసినా ఎర్ర జెండాలు, కార్మికుల నినాదాలతో విశాఖ ఒక్కసారిగా ఎరుపెక్కింది. విశాఖలోని బంగారం లాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసే హక్కు ఎవరికీ లేదంటూ కార్మికులు ఈ సందర్భంగా కేంద్రాన్ని హెచ్చరించారు.

తమ కష్టార్జితంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొంటున్నారు. ఉక్కుకు నష్టాలు ఏమీ రాలేదని, వచ్చినవి తెచ్చినవి కేంద్రం ప్రైవేటీకరణ పేరిట పెట్టిన కష్టాలేనని అని కార్మికులు అంటున్నారు. ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవడం కోసం ఎంతదూరం అయినా వెళ్తామని పేర్కొంటున్నారు.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ లోకేట్ అయిన ఉన్న ప్రాంతం నుంచి భారే ర్యాలీ మొదలైంది. కూర్మన్నపాలెం నుంచి విశాఖ రైల్వే ఆర్ఎం ఆఫీస్ నుంచి జీవీఎంసీ దాకా నాలుగు మార్గాలలో వేలాది మంది కార్మికులు ఈ ర్యాలీ నిర్వహించారు. విశాఖలో ఈ ర్యాలీ రికార్డు స్థాయిలో సాగడం విశేషం.

ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలన్న నిర్ణయాన్ని కేంద్రం 2021 ఫిబ్రవరి 27న తీసుకుంది. ప్లాంట్ తో పాటు మొత్తం పద్దెనిమిది వేల మంది ఉద్యోగ కార్మికులను ప్లాంట్ కి ఉన్న మిగులు భూములను కూడా ప్రైవేట్ పార్టీలకు అప్పగించాలని నిర్ణయించింది.

మూడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్లాంట్ ని కేవలం ముప్పై వేల కోట్లకే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం అంటే దారుణమని అంటున్నారు. అదే విధంగా దేశంలోనే తలమానికంగా ఉన్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని కూడా కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నాటి నుంచి సాగుతున్న ఉద్యమం 500 రోజుల దాకా అలుపెరగని తీరున సాగడం విశేషం.

ఇక ఏపీలోని రాజకీయ పార్టీలు అన్నీ కూడా మొదట్లో మద్దతుగా నిలిచినా ఆ తరువాత మాత్రం సైలెంట్ అయ్యాయి. దాంతో కేవలం వామపక్షాల మద్దతుతోనే ఈ ఉద్యమం సాగుతోంది. ఈ మధ్యలో జరిగిన అనేక ఆందోళనలు కూడా సక్సెస్ అయ్యాయి. దాంతో వేయి రోజులు అయినా పోరాడుతామే తప్ప అలసిపోయే ప్రసక్తే లేదని ఉక్కు కార్మికులు స్పష్టం చేస్తున్నారు.