Begin typing your search above and press return to search.

విశాఖపై పెరిగిపోతున్న నాన్ లోకల్స్ ఆధిపత్యం ?

By:  Tupaki Desk   |   17 Oct 2020 2:30 AM GMT
విశాఖపై  పెరిగిపోతున్న నాన్ లోకల్స్  ఆధిపత్యం ?
X
కొన్ని నియోజకవర్గాల్లో ఇంతే ఎప్పుడూ నాన్ లోకల్స్ దే ఆధిపత్యం కొనసాగుతుంటుంది. ఇటువంటి నియోజకవర్గాల్లో విశాఖపట్నం ముందుంటుంది. గడచిన 25 ఏళ్ళుగా లెక్కలు తీస్తే ఎంతమంది లోకల్స్ ఎంతమంది నాన్ లోకల్ లీడర్లు గెలిచారో అర్ధమైపోతుంది. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితం కావటం లేదు. ప్రతిపార్టీది ఇదే వరస కాబట్టి ఓటర్లు ఎవరికి ఓట్లేసినా వాళ్ళు నాన్ లోకలే అవుతున్నారు. దాంతో ఓడిన, గెలిచిన లీడర్లలో ఎవరి బ్యాక్ గ్రౌండ్ చూసినా ఒక్క లోకల్ లీడర్ కూడా కనబడటం లేదు.

ఎప్పుడో దశాబ్దాల క్రితం అంటే 1990కి మునుపు విశాఖపట్నం లోక్ సభ నుండి స్ధానిక ప్రముఖులు తెన్నేటి విశ్వనాధం, ద్రోణంరాజు సత్యనారయణ, భాట్టం శ్రీరామమూర్తి ఇక్కడి నుండి ఎంపిలుగా గెలిచారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ప్రతి పార్టీ కూడా స్ధానికేతరులకే టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఒకసారి స్ధానికేతరుడు గెలిచారో వెంటనే తర్వాత ఎన్నికల్లో ప్రత్యర్ధిపార్టీలు కూడా స్ధానికేతరులకే టికెట్లు ఇవ్వటం మొదలుపెట్టాయి. క్రమంగా విశాఖపట్నం లోక్ సభ సీటంటే స్ధానికేతరులదే అన్న ముద్ర పడిపోయింది.

విశాఖ నగరం కాస్మొపాలిటన్ నగరం కాబట్టి దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల నుండి ఇక్కడికి వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాల పేరుతో వస్తుంటారు. ఇక రాష్ట్రంలోని అన్నీ జిల్లాల ప్రజలు ఇక్కడున్నారు. దాంతో హోలు మొత్తం మీద చూస్తే విశాఖనగరం ప్రత్యేకంగా వలసవాదుల నగరంగా అయిపోయింది. షిప్ యార్డు, విమానాశ్రయం, నేవీ, స్టీలు ప్లాంటుతో పాటు అనేక కేంద్రప్రభుత్వ కార్యాలయాలున్నాయి. అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలున్నాయి. ఈ కారణంగా ఉత్తర భారతదేశానికి చెందిన లక్షలాదిమంది జనాలు ఇక్కడున్నారు.

ఇదే సమయంలో వడ్డీ వ్యాపారాలు, చిన్ని బిజినెసులు చేసుకునే ఉత్తరాధి రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇక పర్యాటక ప్రాంతంగా కూడా విశాఖ జిల్లా దేశంలో ఎంతో పేరుండటంతో పర్యాటకరంగం మీద ఆధారపడిన హోటళ్ళు, రెస్టారెంట్లు రకరకాల వృత్తుల వాళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఇక రాష్ట్రంలోని ఇతర జిల్లాల జనాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా ఏ విధంగా చూసినా వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్ధిరపడిన జనాలే ఎక్కువ కాబట్టి ప్రజల్లో కూడా స్ధానికులు తక్కువనే అనుకోవాలి. అందుకనే ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి విశాఖలో పోటీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఓట్లేసే వాళ్ళలో ఎక్కువమంది స్ధానికేతరులున్నారు కాబట్టే పోటీ చేస్తున్న వాళ్ళు కూడా నాన్ లోకల్సే ఉంటున్నారు.

1989 ఎన్నికల్లో కేరళకు చెందిన ఉమా గజపతిరాజు విశాఖలో పోటి చేసి గెలవటంతో తీసుకుంటే 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంవివి సత్యనారాయణ వరకు అంతా నాన్ లోకల్సే. టీ. సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, ఎంవివిఎస్ మూర్తి, పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు ఇలా ఎవరిని చూసినా ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ స్ధిరపడినవాళ్ళే కనబడతారు. ఇంతమంది ఇక్కడెందుకున్నారు ? ఎందుకంటే వీళ్ళంతా ముందు వ్యాపార, పరిశ్రమల ఏర్పాటు కోసం విశాఖకు వస్తారు. తర్వాత ఇక్కడే బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత రాజకీయాల వైపు చూస్తారు. ఎలాగు డబ్బుకు లోటులేదు కాబట్టి ఇక రాజకీయాల్లో కూడా తిరుగుండదు.

ఇపుడు లేటెస్టు నేతలను తీసుకుంటే మంత్రి అవంతీ శ్రీనివాస్ ది పశ్చిమగోదావరి. పురందేశ్వరి చెన్నైలో పుట్టారు. గంటా శ్రీనివాసరావుది ప్రకాశం జిల్లా. ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణది కృష్ణాజిల్లా. మాజీ ఎంఎల్ఏలు పంచకర్ల రమేష్ బాబుది కృష్ణా జిల్లా. చింతలపూడి వెంకటరమణది పశ్చిమగోదావరి. అరకు ఎంపిగా గెలిచిన కొత్తాగీత పశ్చిమగోదావరి. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, టి సుబ్బరామిరెడ్డిది నెల్లూరు. ఇప్పుడు ఎంపి ఎంవివి సత్యనారాయణది కూడా పశ్చిమగోదావరే. ఇలా ఏ అభ్యర్ధిని తీసుకున్నా, ఏ పార్టీ తీసుకున్నా నాన్ లోకల్స్ కే అగ్రస్ధానం ఇస్తుండటంతో గెలిచినా, ఓడినా అందరూ స్ధానికేతరులే. అందుకనే విశాఖ స్ధానం అంటే నాన్ లోకల్స్ అడ్డాగా మారిపోయింది.