తెలంగాణలో పల్లె బాట పట్టిన కరోనా !

Tue Jul 14 2020 22:00:12 GMT+0530 (IST)

Pandemic in the countryside in Telangana!

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనేపోతుంది. ఇప్పటివరకు తెలంగాణాలో నమోదు అయిన కరోనా కేసుల్లో ఎక్కువ శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు అవుతూ వస్తున్నాయి. దాదాపుగా రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో 60 శాతానికి పైగా కేసులు ఒక్క గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. అయితే గత వారం రోజుల క్రితం వరకు గ్రేటర్ పరిధిలో తప్ప తెలంగాణలో ఇతర జిల్లాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదు. కానీ తాజాగా కరోనా తెలంగాణలోని ఇతర జిల్లాలపై కూడా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. దీనితో ఇప్పటివరకు సేఫ్ అనుకున్న జిల్లాల్లో సైతం కరోనా కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతుండటం తో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. పట్నంలో అయితే కరోనా భారీ నుండి తప్పించుకోలేము అని ..పల్లెలకి చేరితే మీ వెంటే నేను అంటూ కరోనా కూడా పల్లెబాట పట్టింది.ముఖ్యంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పాజిటివ్ కేసులు విరివిగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 109కు చేరింది. ఇందులో ఇప్పటివరకు కరోనా తో పోరాడుతూ 9 మంది మృతి చెందగా 17 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. 22 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 61 మందిని ఇంటి వద్దనే ఐసోలేషన్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా పెరుగుతున్నాయి.

ఇకపోతే పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం తెనుగువాడకు చెందిన వ్యక్తి కరోనా తో ఆదివారం మృతి చెందగా ఆయన వయస్సు 43 సంవత్సరాలే కావడం గమనార్హం. అయితే ఆ వ్యక్తికీ గతంలో షుగర్ ఉన్నట్టు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా తేలింది అయితే నాకు షుగర్ ఉంది అని చెప్తున్నా కూడా హోమ్ ఐసోలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూవచ్చారు. వ్యాధి తీవ్రత పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బందికి మారడంతో హుటాహుటిన ఆసుపత్రికి వచ్చినప్పటికీ అతడు బతకలేకపోయాడు. ముందే ఐసోలేషన్లో పెట్టి చికిత్స అందించి ఉంటే అతడు బతికి ఉండేవాడని వారి బంధువులు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఒక్క వ్యక్తినే కాకుండా జిల్లాలో చాలామందిని హోమ్ ఐసోలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనిపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటై మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ మృతదేహాలను తరలించేందుకు వినియోగించే అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం గమనార్హం. ఒక్కటే అంబులెన్స్ ఉండటంతో .. అందులో కరోనా రోగి మృతదేహం తరలిస్తే ఇతరులకి అది ఇతరులకు వినియోగం అయ్యేలా లేదు. . మున్సిపల్ ట్రాక్టర్ వచ్చినప్పటికీ దానిని నడిపేందుకు డ్రైవర్ ధైర్యం చేయలేక పోవడంతో ఆ ట్రాక్టర్ను డాక్టరే నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో హోం ఐసోలేషన్లో పెట్టే విషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రం ఆసుపత్రిలో వెంటిలేటర్ అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కరోనా భయంతో జూలపల్లి మండల కేంద్రం జూలపల్లిలో శనివారం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. దీనితో రోడ్లు మొత్తం నిర్మానుష్యం గా దర్శనం ఇస్తున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే ముగ్గురు వైరస్ బారిన పడి మరణించగా సోమవారం సింగరేణి కార్మికుడు ఈ మహమ్మారికి బలయ్యాడు. అలాగే మరో వ్యక్తికీ పాజిటివ్ గా తేలింది. అలాగే పోలీస్ శాఖను కూడా కరోనా బయపెడుతుంది. ఇప్పటికే అక్కడ ఒక ఎస్ ఐ ఒక మహిళ కానిస్టేబుల్ కు ఒక హోమ్ గార్డుకు కరోనా సోకింది. మరో ఎస్ ఐకి కూడా పాజిటివ్ వచ్చింది.