నాయకా.. ఆ దూకుడు ఏమైంది!

Tue Sep 29 2020 21:31:30 GMT+0530 (IST)

Leader .. where is the aggression!

విరాట్ కోహ్లి.. ఫార్మాట్ ఏదైనా ప్రపంచంలోనే నంబర్ వన్ బ్యాట్స్ మెన్. ఐపీఎల్లో కూడా అత్యధిక పరుగుల జాబితాలో అతడిదే అగ్ర స్థానం. ఇప్పటి వరకూ 177 మ్యాచ్ లలో 5 412 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు 36 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాతి స్థానంలో రైనా ఉన్నాడు. కోహ్లీ ఎంత రాణించినా తన జట్టుకు ట్రోఫీ మాత్రం అందించలేకపోయాడు.
ఇప్పుడు ఈ సీజన్ లో మాత్రం కోహ్లీ మరీ తేలిపోతున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ లలో విఫలం అయ్యాడు. మొత్తం ఇప్పటిదాకా చేసిన పరుగులు 17 మాత్రమే.ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫించ్ (52) పాడిక్కల్ (54) డివిలియర్స్ (55 నాటౌట్) మెరుపులతో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కంటే ముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లి విఫలమయ్యాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన కాట్రెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫీల్డింగ్‌లోనూ రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేయడంతో అతడు రెచ్చి పోయి భారీ సెంచరీ సాధించి తన జట్టుకు విజయం అందించాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో కోహ్లీ విఫలం కావడంతో అతడిపై విమర్శలు పెరిగాయి. దీంతో సునీల్ గావస్కర్ కోహ్లి బ్యాటింగ్‌పై విమర్శలు చేయడం అనుకోకుండా అనుష్క శర్మ ప్రస్తావన తేవడం వివాదాస్పదమైంది.

ఐపీఎల్‌లో కోహ్లి.. గత సీజన్ నుంచే పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు.
గత సీజన్లో ఆర్సీబీ..సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో విరాట్ 7 బంతుల్లో 16 రన్స్ చేశాడు. అంతకు ముందు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 7 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లి 3 సిక్సులు బాదాడు. గత సీజన్ నుంచి ఇప్పటి వరకూ 8 ఇన్నింగ్స్‌ల్లో ఆడిన విరాట్ 25 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. విరాట్ దూకుడుగా ఆడి ఫామ్ అందుకుంటే అతడిని మించినోడు లేడు..అందువల్లే నాయకా బ్యాట్ జులుపించు అంటూ కింగ్ కోహ్లీ అభిమానులు కోరుకుంటున్నారు.