Begin typing your search above and press return to search.

కామారెడ్డి జిల్లాలో దారుణం: ‌వైర‌స్ నెపంతో త‌ల్లీకొడుకును బంధించిన గ్రామ‌స్తులు

By:  Tupaki Desk   |   5 July 2020 2:30 AM GMT
కామారెడ్డి జిల్లాలో దారుణం: ‌వైర‌స్ నెపంతో త‌ల్లీకొడుకును బంధించిన గ్రామ‌స్తులు
X
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌జ‌లంద‌రినీ భ‌యాందోళ‌న‌లో ప‌డేస్తోంది. ఎవ‌రు ఏ చిన్న అస్వ‌స్థ‌త‌త‌కు గుర‌యినా వైర‌స్‌గా భావించి వారిని వెలివేసే స్థాయికి చేరింది. అనారోగ్యం బారిన ప‌డిన వారిని బ‌హిష్క‌రించిన‌ట్టు చూస్తున్నారు. తాజాగా అలాంటి ఘ‌ట‌న తెలంగాణ‌లోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వైర‌స్ సోకింద‌నే భ‌యంతో త‌ల్లీకుమారుడిని కొంద‌రు గ్రామ‌స్తులు బంధించారు. వారిని గ్రామంలోకి రాకుండా అడ్డుకుని ఓ పాఠ‌శాల‌లోని గదిలో ఉంచారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి... భిక్కనూరు మండలం జంగంపల్లిలో సుధారాణి త‌న‌ కుటుంబంంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఆమె కూతురుకి ఇటీవ‌ల‌ ప్ర‌స‌వం జ‌రిగింది. దీంతో కూతురిని చూసేందుకు త‌ల్లి సుధారాణి, సోద‌రుడు రాకేశ్ ఆస్ప‌త్రికి వెళ్లారు. అయితే అనుకోకుండా పుట్టిన బిడ్డ‌కు వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఆ విష‌యం తెలియ‌క‌పోవ‌డంతో వీరిద్ద‌రూ ఆమె వ‌ద్ద‌కు వెళ్లారు. ఈ విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వారు కూతురిని చూసి స్వ‌గ్రామం తిరిగి రాగా సుధారాణి, రాకేశ్‌ల‌ను గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రాకుండా అడ్డుకుని వారిని అవ‌మానించి అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రినీ గ్రామశివారులోని పాఠ‌శాల‌లో ఉన్న‌ ఓ గదిలో ఉండాలని గ్రామ‌స్తులు నిర్ణ‌యించారు. దీంతో వారిద్ద‌రూ ఆ గ‌దిలోకి వెళ్లారు. అయితే వారు బ‌య‌ట‌కు రాకుండా పాఠ‌శాల చుట్టూ ముళ్ల కంచె వేశారు.

ఈ ఘ‌ట‌న‌తో వారు మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. ఈ బాధ‌తో వారు సెల్ఫీ వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైర‌స్ కంటే గ్రామస్తుల మానసిక వేధింపులతోనే తాము చ‌నిపోయేలా ఉన్నామ‌ని బాధితులు వాపోయారు. దీనిపై భిన్నంగా స్పంద‌న వ‌స్తోంది. నెటిజ‌న్లు అంద‌రూ వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. గ్రామ‌స్తుల తీరును ఖండిస్తున్నారు.