Begin typing your search above and press return to search.

ఆ గ్రామంలో వెల్లివిరిసిన కృష్ణ 'చైతన్యం'..!

By:  Tupaki Desk   |   7 Dec 2022 6:10 AM GMT
ఆ గ్రామంలో వెల్లివిరిసిన కృష్ణ చైతన్యం..!
X
మనుషులకు.. పశువులకు తేడా ఏంటీ?.. దేవుని గురించి చింత లేని జీవితం ఎందుకు అనే ఆలోచన నుంచే పుట్టిందే ‘కృష్ణ చైతన్య’ సమాజం. ఈ ప్రాంతంలో ఏ ఇంటికి కూడా విద్యుత్ సౌకర్యం లేదు. అయినప్పటికీ వారి జీవన విధానం మాత్రం అందరికీ వెలుగును చూపించే దిక్సూచిగా మారుతోంది. దీంతో ఈ గ్రామస్థుల జీవన విధానంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అడవిలో కూర్మ అనే కుగ్రామం ఉంది. ఈ గ్రామంలో కృష్ణ చైతన్య సమాజం పేరుతో 12 కుటుంబాలు జీవిస్తున్నాయి. మొత్తం 56 మంది నివాసం ఉంటున్న ఈ గ్రామంలో 16 మంది విద్యార్థులు.. ఆరుగురు బ్రహ్మచారులు.. మిగిలిన వారంతా గృహస్థ జీవనాన్ని గడుపుతున్నారు.

భక్తి వేదాంత స్వామి ఆదేశాల మేరకు భక్తి వికసా స్వామి సారథ్యంలో 2018 జూలైలో ఈ కూగ్రామం వెలిసింది. కూడు.. గుడ్డ.. నిత్యావసర వస్తువులన్నీ ప్రకృతి నుంచే సంపాదించుకోవచ్చని ఈ గ్రామస్థులు నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యం చేస్తూ కలిసి కట్టుగా జీవిస్తున్నారు. ఈ ఏడాది ఉమ్మడిగా 198 బస్తాల ధాన్యాన్ని పండించారు. రోజు వారీ సరిపడా కూరగాయలు పండించుకుంటున్నారు.

విత్తు మొదలు కోతల దాకా ఎవరి మీద ఆధారపడకుండా గ్రామస్థులే పనులు చేసుకుంటున్నారు. ఇళ్ళను సైతం ఇసుక.. సున్నం.. బెల్లం.. మినములు.. కరక్కాయి.. మెంతులు మిశ్రమంగా చేసి గానుగలో ఆడించి.. గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో నిర్మించుకున్నారు. దుస్తులను సైతం కుంకుడు రసంతో శుభ్రం చేసుకుంటున్నారు.

సనాధన ధర్మం.. వైదిక సంస్కృతి.. వర్ణాశ్రమ విధానాన్ని తిరిగి స్థాపించడమే తమ లక్ష్యంగా కృష్ణ చైతన్య సమాజం పని చేస్తోంది. చిన్నారులు గురుకుల పద్ధతిలో విద్యాభ్యాసం చేస్తున్నారు. సంస్కృం.. ఆంగ్లం.. హిందీ.. తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. యస్సు బట్టి వృత్తి పనులపై శిక్షణ పొందుతున్నారు.

ఉదయం 4:30 గంటలకు దైవారధనతో వీరి దిన చర్య ప్రారంభమవుతోంది. ఉదయం భజన.. ప్రసాద స్వీకరణ వంటి రోజు వారీ కార్యక్రమాల తర్వాత వ్యవసాయ పనులకు వెళుతుంటారు. మళ్లీ సాయంత్రం అధ్యాత్మిక చింతనలో జీవిస్తున్నారు. గ్రామంలో విద్యుత్ సదుపాయం కూడా లేదు. చీకట్లోనే జీవిస్తున్నారు.

గ్రామంలో విద్యుత్ ఉంటే సౌకర్యాలు పెరుగుతాయని.. డబ్బు అవసరం పడుతుందని.. యాంత్రికంగా జీవనం మారుతుందని వాటికి దూరంగా ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఒక్క గుడిసెతో ప్రారంభమైన కృతచైతన్య సమాజం ఐదేళ్లలో 56మందికి చేరిందని చెబుతున్నారు. ప్రస్తుత ప్రపంచంలోనూ డబ్బు లేకపోయినా ప్రకృతిలో హాయిగా జీవించవచ్చనే సందేశాన్ని కూర్మ గ్రామస్థులు ఇస్తున్నారు.