ఆయన కోసం కర్ణాటకలో విజయశాంతి ప్రచారం!

Fri Apr 19 2019 20:00:02 GMT+0530 (IST)

Vijayashanti Campaign in Karnataka Lok Sabha Elections

లోక్ సభ ప్రతినాయకుడు మల్లికార్జున ఖర్గే టార్గెట్ గా కర్ణాటక రాష్ట్రం కలబుర్గిలో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కలబుర్గిలో భారీ బహిరంగ నిర్వహించారు. భారీ జనసందోహంతో కలబుర్గి మొత్తం కమలమయం చేశారు. అదేవిధంగా బీజేపీ చీఫ్ అమిత్ షా - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్డూరప్ప పర్యటించారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి కలబుర్గి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటోంది. కాగా మల్లికార్జునఖర్గేకు శిష్యుడిగా ఉన్న చించోళి ఎమ్మెల్యే డాక్టర్ ఉమేశ్ జి.జాదవ్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుని పోటీలో ఉన్నారు. ఫలితంగా గురుశిష్యుల మధ్య పోటీ ఏర్పడింది. దీంతో గెలుపుపై రెండు పార్టీల పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా తామేమీ తక్కువ కాదంటూ ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు. అదేవిధంగా మాజీ సీఎం సిద్ధరామయ్య వచ్చి వెళ్లారు. తాజాగా తెలుగు నటి - కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి శుక్రవారం కలబుర్గి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే తరఫున విజయశాంతి పర్యటిస్తారు. 
 
కలబుర్గి పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత 2009 - 2014లో రెండుసార్లు వరుసగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జునఖర్గే విజయం సాధించారు. అయితే ఈసారి గెలిస్తే వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించినట్లు అవుతుంది. అయితే దీనికి భిన్నంగా బీజేపీ గెలుపు వ్యూహాలు రచిస్తోంది. ఈమేరకు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేశ్ జాదవ్ ను బీజేపీలోకి చేర్చుకుని పోటీలో ఉంచింది. బీజేపీ జాతీయ నాయకులు సైతం ప్రచారానికి దిగి మల్లికార్జున ఖర్గేను ఓడించే దిశగా ప్రచారం ముమ్మరం చేశారు. దీనికి తోడు పార్లమెంట్ పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో నాలుగింట బీజేపీ విజయం సాధించగా.. మూడింట కాంగ్రెస్.. ఒకటి జేడీఎస్ గెలిచింది.