హిరాఖుడ్ రైలు ప్రమాదంలో విజయసాయి సంచలన వ్యాఖ్యలు

Thu Jul 22 2021 11:16:13 GMT+0530 (IST)

Vijayasai sensational comments on Hirakud train crash

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపై సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి. గడిచిన కొంతకాలంగా అశోక్ గజపతిపై వరుస పెట్టి ఆరోపణలు.. విమర్శలు చేసే ఆయన.. తాజాగా చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి విజయసాయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త రచ్చకు తెర తీయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. 2017 జనవరి 21న రాత్రి పదకొండున్నర సమయంలో హిరాఖుడ్ రైలు ప్రమాదం చోటు చేసుకోవటం 42 మంది ప్రయాణికులు మరణిస్తే.. 70 మంది గాయపడిన వైనం తెలిసిందే.ఈ ప్రమాదం జరగటానికి కారణం మావోలు రైల్వే ట్రాకుల్ని ధ్వంసం చేసినట్లుగా చెప్పారని.. కానీ అది నిజం కాదన్నది విజయసాయి వాదన. అప్పుడెప్పుడో జరిగిన రైల్వే ప్రమాదానికి సంబంధించి కొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొచ్చారు. అప్పట్లో కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజు.. రైల్వే ప్రమాదాన్ని మేనేజ్ చేశారని.. అందుకోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా తాజా లేఖలో పేర్కొన్నారు. ‘ప్రమాదం జరిగిన తర్వాతి రోజు తెల్లవారుజామున కొందరు కాంట్రాక్టు కార్మికుల్ని తీసుకెళ్లి రైలు పట్టాల వద్ద మార్పులు చేశారు. ప్రమాదాన్ని మావోలపైన నెట్టారు. వారు ట్రాక్ ను ధ్వంసం చేయటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అందరిని నమ్మించారు’’ అని ఆరోపించారు.

నిజానికి ప్రమాదం రైల్వేస్టేషన్ యార్డులో.. ఆపరేటింగ్ క్యాబిన్ సమీపంలో జరిగినందని.. కానీ ఆ ప్రమాదానికి ఏ మాత్రం సంబంధం లేని రాయగఢ్ ఎస్పీ.. ఒడిశా డీజీపీలు చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిరంతరంగా కాపలా ఉంటుందని.. రైల్వే సిబ్బంది తిరుగుతుంటారని.. అలాంటి చోటుకు నక్సల్స్ వచ్చి ట్రాక్ దెబ్బ తినేలా ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుసైతం ప్రమాదానికి.. నక్సల్స్ కు సంబంధం లేదని చెప్పటాన్ని గుర్తు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సీబీసీఐడీ విచారణను పక్కదారి పట్టించారన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సైతం తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని.. బీవీవీ రాజు.. వాల్తేరు ప్రోటోకాల్ అధికారి విష్ణుమూర్తిలకు సైతం పెద్ద ఎత్తున నగదు ఇచ్చి విచారణను మేనేజ్ చేశారని ఆరోపించారు. ఇందుకోసం అధికార దుర్వినియోగంతో పాటు.. పెద్ద ఎత్తున నిధుల్ని పక్కదారి పట్టించినట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత రచ్చగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.