Begin typing your search above and press return to search.

వార్నింగ్ ఇచ్చే కేసీఆర్.. అందుకు కట్టుబడతారా?

By:  Tupaki Desk   |   21 Feb 2020 6:00 AM GMT
వార్నింగ్ ఇచ్చే కేసీఆర్.. అందుకు కట్టుబడతారా?
X
రాములమ్మ గురించి తెలిసిందే. ప్రజాజీవితంలోనే ఉన్నా.. ప్రజల మధ్యకు రాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం ద్వారా తాను యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉన్నట్లుగా సంకేతాలు ఇస్తుంటారు. ఏ మాటకుఆ మాట చెప్పాలి. ఆమె పోస్టు పెట్టారంటే.. నూటికి 90 శాతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉంటాయి. లక్ష్యం సారు మాత్రమే అన్న విషయాన్ని తన పోస్టులతో స్పష్టం చేస్తుంటారు.

తాజాగా అలాంటి పోస్టు మరొకటి పెట్టారు విజయశాంతి. ఇటీవల స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు రాజకీయాల గురించి బోధనలు చేసేందుకు పిలిపించుకొని మరీ క్లాస్ పీకటమే కాదు.. ఘాటు వార్నింగ్ కూడా ఇచ్చేసిన వైనం తెలిసిందే. ఇలా వార్నింగ్ లు ఇవ్వటం తెలంగాణ సారుకు అలవాటే. అయితే.. ఇలా మీటింగ్ పెట్టి ఇంత తీవ్రంగా మాటలు అనేసే సీఎం లేరన్న వాదన వినిపించినా.. అదంతా తెలంగాణ క్షేమం కోసమేనని సర్దిచెప్పుకునేవారెందరో.

ఇదిలా ఉంటే.. ఫైర్ బ్రాండ్ విజయశాంతి సారును టార్గెట్ చేశారు. పని చేయాలని.. లేదంటే పదవుల నుంచి తప్పుకోవాలని వార్నింగ్ ఇచ్చే కేసీఆర్.. తాను చెప్పిన మాటల్ని తనకు వర్తింపచేస్తారా? అంటూ ప్రశ్నించారు. పని చేయని సీఎంగా మీరు కూడా మీ మాటలకు కట్టుబడతారా? అని ప్రశ్నించింది. హైదరాబాద్ ప్రజల్లో కేసీఆర్ సర్కారు పని తీరు మీద తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోందని చెప్పారు. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లకు ట్రైనింగ్ క్లాస్ అంటూ ప్రగతి రిసార్ట్స్ లో చెప్పిన మాటల్నే.. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన తమ నేతల వద్దా రిపీట్ చేశారన్నారు.

ఒకేరకమైన ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ప్రజల్ని మభ్య పెట్టేందుకు కేసీఆర్ చేసే గారడీల్ని హైదరాబాద్ ప్రజలు నమ్మరన్నారు. హైదరాబాద్ లోని గ్రేటర్ కు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికి డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రామిస్ ను పూర్తి చేయకపోవటాన్ని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తానని.. ఒకవేళ తాము ఆ పని చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పే కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఇన్ని నెలల తర్వాత కూడా నల్లా నీరు చాలా ప్రాంతాలకు రావటం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో సీఎం కేసీఆర్ గడిచిన ఆరేళ్లలో ఎన్నోసార్లు మాట తప్పారని.. ఈ లెక్కన ఆయన ఎన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాలంటూ చురకలేశారు. మొత్తానికి కేసీఆర్ మాటల్ని ఆయనకే వర్తించేలా చేసి వినిపించిన వాదన సారుకు చికాకు తెప్పించే ప్రయత్నం చేశారు ఫైర్ బ్రాండ్.