పోలవరం వాస్తవాలు వెలికి తీసిన విజయసాయి రెడ్డి

Mon Jun 24 2019 20:10:42 GMT+0530 (IST)

Vijay Sai Reddy On about Polavaram Project in Rajya Sabha

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పాలన పట్టాలెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టడంతో.. ఆయనపై బాధ్యత కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగానే పాలనపై పూర్తిగా దృష్టి సారించారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో ఎన్నికల హామీల అమలుకు కూడా కృషి చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై సఖ్యతగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. స్నేహంగా ఉంటూనే కేంద్రంతో పనులు చేయించుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. అందులో సక్సెస్ అయింది. ఇప్పటికే కేంద్రం వద్ద పెండింగులో ఉన్న కొన్ని నిధులను విడుదల కూడా చేయించుకోగలిగారు. తాజాగా వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఈ సారి ఆంధ్రప్రదేశ్ సౌభాగ్య ప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇది జరిగింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం అంచనాలకు సంబంధించిన వివరాలు కావాలని ప్రశ్న అడిగారు. దీనికి సమాధానంగా జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా కీలక ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55548.87 కోట్లు సవరించిన ఒప్పందాలకు కేంద్ర జలశక్తిశాఖ సలహా సంఘం ఆమోదం తెలిపింది.  2017-18 ధరలకు అనుగుణంగా ఈ మేరకు తుది అంచనాలను ఖరారు చేసినట్టు ఆయన వెల్లడించారు.

అంతేకాదు ఏఏ పనులకు ఎంత మొత్తం అన్న విషయం పైనా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. సవరించిన అంచనా వ్యయం ప్రకారం పోలవరం కుడి ప్రధాన కాలువ పనులకు రూ. 4318.97 కోట్లు - ఎడమ ప్రధాన కాలువకు రూ. 4202.69 కోట్లు - హెడ్ వర్క్స్ కు రూ.9734.34 కోట్లు - పవర్ హౌస్ పనులకు రూ. 4124.64 కోట్లు - భూసేకరణ - పునరావాసం - పునర్నిర్మాణ పనులకు రూ.33168.23 కోట్ల రూపాయలు అంచనా ఖర్చులకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు. వీటికి సంబంధించిన నిధుల విడుదలకు కూడా త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.