Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు షాకిచ్చిన వీహెచ్.. రేసులో ఎవరంటే?

By:  Tupaki Desk   |   19 Jun 2021 8:30 AM GMT
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కు షాకిచ్చిన వీహెచ్.. రేసులో ఎవరంటే?
X
మరే రాజకీయ పార్టీలో లేనంత విచిత్రమైన రాజకీయ వాతావరణం కాంగ్రెస్ లో కనిపిస్తుంది. ఆ పార్టీలో ఎప్పుడు ఎవరికి పెద్ద పీట వేస్తారో? ఎవరిని పక్కన పెట్టేస్తారో తెలీదు. అంతేకాదు.. అధినాయకత్వాన్ని ప్రభావితం చేసేందుకు ఆ పార్టీ నేతలు అనుసరించే విధానాలు అదిరే షాకుల్ని ఇస్తాయి. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెబుతున్నారు. గడిచిన కొద్దికాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధిని ఎంపిక చేయటానికి భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్రబాధ్యుడ్ని తెలంగాణకు పంపి.. పలు గ్రూపులతో ప్రత్యేకంగా భేటీ అయి.. నివేదికల్ని సిద్ధం చేశారు.

వడపోతల మీద వడపోతలతో పాటు.. పలు కాంబినేషన్లను ఆలోచించిన మీదట తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసినట్లుగా అనధికార వార్తలు వచ్చాయి. దీంతో.. రేవంత్ నియమాకాన్ని వ్యతిరేకించే వారు పెద్ద ఎత్తున విమర్శలు చేయటంతో పాటు.. ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పంపారు. దీంతో.. అధినాయకత్వం తన దూకుడును తగ్గించి.. నిర్ణయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ లో పెట్టేసింది.

రేవంత్ కు పగ్గాలు అప్పగించటం ఖాయమన్న మాట వినిపించిన తర్వాత నిర్ణయంలో మార్పు రావటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదే విషయాన్ని లోతుగా ఆరా తీస్తే.. వృద్ధ సింహం వీహెచ్ హనుమంతరావు పుణ్యమా అని టీపీసీసీ చీఫ్ పదవిని తేల్చకుండా పెండింగ్ లో ఉంచినట్లుగా తెలుస్తోంది. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఎలా అప్పగిస్తారంటూ వరుస పెట్టి ఫిర్యాదులు ఇవ్వటమే కాదు.. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టిన వైనంతో అధినాయకత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడీ విషయం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.