Begin typing your search above and press return to search.

సారీ కాదు స‌స్పెండ్ చేయాలంటున్న వెంక‌ట‌రెడ్డి!

By:  Tupaki Desk   |   13 Aug 2022 7:47 AM GMT
సారీ కాదు స‌స్పెండ్ చేయాలంటున్న వెంక‌ట‌రెడ్డి!
X
ఇటీవ‌ల కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్.. భువ‌న‌గిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌ల వివాదం మ‌రో మలుపు తిరిగింది. అద్దంకి దయాక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ మేర‌కు తాజాగా రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌ముంద‌ని రేవంత్ చెప్పారు. ఆయ‌న అవ‌స‌రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవ‌స‌ర‌ముంద‌న్నారు. అంతేకాకుండా అద్దంకి దయాక‌ర్ పైన క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా తెలిపారు.

రేవంత్ రెడ్డి త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌డంపై కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందించారు. సారీ చెప్తే స‌రిపోద‌ని అద్దంకి ద‌యాక‌ర్ ను కాంగ్రెస్ పార్టీ స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. దయాకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తేనే రేవంత్‌రెడ్డి క్షమాపణలపై స్పందిస్తానని వెంక‌ట‌రెడ్డి ప‌ట్టుబ‌డుతున్నారు. ఆ తర్వాతే మునుగోడు ప్రచారానికి వెళ్తానని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి డిమాండ్ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రేవంత్ రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పినా కోమ‌టిరెడ్డి వెన‌క్కి త‌గ్గ‌ని నేప‌థ్యంలో అద్దంకి దయాక‌ర్ పైన చ‌ర్య తీసుకుంటారో, లేదో వేచిచూడాల్సిందే.

కాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి సోద‌రుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి కూడా ఆమోదించారు.

ఈ నేప‌థ్యంలో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇంకా ఎన్నిక‌ల షెడ్యూల్ రాక‌ముందే కాంగ్రెస్ తోపాటు అధికార టీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అందులోనూ ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావ‌డంతో ఆ పార్టీ ఇక్క‌డ గెలిచి త‌మ స‌త్తా చాటాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉంది. మునుగోడులో విజ‌యం సాధిస్తే వచ్చే అసెంబ్లీల్లో ఈ పాజిటివ్ వేవ్ ను కొన‌సాగించి రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవాల‌ని రేవంత్ సార‌థ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఉర‌క‌లేస్తోంది.