Begin typing your search above and press return to search.

ఫిరాయింపులపై వెంకయ్య డబల్ యాక్షన్

By:  Tupaki Desk   |   28 Feb 2021 7:30 AM GMT
ఫిరాయింపులపై వెంకయ్య డబల్ యాక్షన్
X
‘పార్టీ ఫిరాయింపుల కేసులనూ నిర్దిష్టకాలంలో విచారించి నిర్ణయం తీసుకోవాలి’ .. ఇది ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు. చెన్నైలోని అంబేద్కర్ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. న్యాయవ్యవస్ధ ఎలాగుండాలి, కేసుల విచారణ ఎంత వేగంగా జరగాలి, సామాన్యుడికి న్యాయాన్ని వీలైనంత తొందరగా అందించాల్సిన అవసరం న్యాయవ్యవస్ధపై ఎంతుంది అనేటువంటి అంశాలపై తనదైన శైలిలో వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేయటం, నీతులు చెప్పడం చేశారు.

వెంకయ్య ప్రస్తావించిన కొన్ని అంశాల్లో వాస్తవం ఉంది. సామాన్యుడికి న్యాయవ్యవస్ధ నూరుశాతం న్యాయం అందించటంలేదన్న విషయంలో వాస్తవం ఉంది. న్యాయవ్యవస్ధ సామాన్యుడి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కేసుల పరిష్కారంలో ఆలస్యం జరగటం వల్ల సామాన్యుడికి న్యాయం కూడా ఖరీదైపోతోందన్నారు.

ఇలాగే ప్రజాప్రతినిధుల కేసుల్లో న్యాయ ప్రక్రియను వేగం చేయటంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని సూచించారు. వీటిన్నిటితో పాటు ఎన్నికల్లో అక్రమాలు, అధికార దుర్వినియోగం లాంటి కేసులను తొందరగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల కేసులు పెండింగ్ లో ఉందంటు ఆవేదన వ్యక్తం చేయటంలో తప్పేమీలేదు. లోక్ అదాలత్, మొబైల్ కోర్టులు, మాతృభాషలోనే న్యాయవ్యవస్ధ కార్యకలాపాలను నిర్వహించాలని చెప్పటంలో తప్పేమీలేదు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ పార్టీ ఫిరాయింపులపై వెంటనే విచారణ జరిపించి నిర్ణయం తీసుకోవాలని సూచించటంలోనే డబల్ యాక్షన్ కనబడుతోంది. ఎందుకంటే ఒకపార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు తర్వాత మరో పార్టీలోకి ఫిరాయించటం సాధారణమైపోతోంది. వైఎస్ హయాంలో ఉమ్మడి ఏపీలో జరిగింది ఇదే. చంద్రబాబునాయుడు హయాంలో ఒక రకంగా, జగన్ హయాంలో ఇంకో రకంగా కూడా ఇదే జరిగింది. ఇపుడు పశ్చిమబెంగాల్లో బీజేపీ స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది.

మరి సొంతపార్టీనే ఫిరాయింపులను ప్రోత్సహించటాన్ని వెంకయ్య ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే 2019 ఎన్నికల ఫలితాలు రాగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించారు. వాళ్ళు పార్టీ ఫిరాయించగానే ఆఘమేఘాల మీద వాళ్ళు నలుగురిని బీజేపీ సభ్యులుగా గుర్తిస్తు వెంకయ్యే నోటిఫికేషన్ ఎలా జారీచేశారు.

పార్టీ ఫిరాయించినందుకు వాళ్ళపై వెంకయ్య అనర్హత వేటు వేయాలి కదా ? ఎందుకు వేయలేదు ? ఒకవైపు తానే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తు మరోవైపు ఫిరాయింపులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పటమంటే డబల్ యాక్షన్ కాక మరేమిటి ?