ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కోవిడ్!!

Tue Sep 29 2020 23:59:34 GMT+0530 (IST)

Venkaiah Naidu Corona positive

భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు.  తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షలో ఆయనకు పాజిటివ్ అని నిర్దారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. వెంకయ్య వయసు 71 సంవత్సరాలు కావడంతో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు లక్షణాలు చాలా స్వల్పంగా ఉన్నాయని... ప్రస్తుతం హోం ఐసోలేషన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వెల్లడించారు.ఎం.వెంకయ్య నాయుడు భార్య శ్రీమతి ఉషా నాయుడు పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇటీవలే రాజ్యసభ వర్షాకాల సమావేశాలు జరిగాయి. రాజ్యసభ ఛైర్మన్ గా ఆయన సభను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడి ఉండొచ్చని చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు అక్టోబర్ 1 వరకు కొనసాగాల్సి ఉంది. కానీ  సెప్టెంబర్ 23 నంచే నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇది ఒక రకంగా ఇన్ఫెక్షన్ మరింత మంది కి సోకకుండా కాపాడినట్టయ్యింది.

ఇదిలా ఉండగా... ఆగస్టు 17 -  సెప్టెంబర్ 22 మధ్య జరిగిన రెండో సీరో సర్వే నివేదిక అంచనాల ప్రకారం దేశంలోని వయోజనుల్లో 7.1 శాతం మంది వైరస్ బారిన పడ్డారని పేర్కొన్నారు.  రాబోయే రెండు రోజుల్లో అన్‌లాక్ 5 కోసం కేంద్రం మార్గదర్శకాలను ప్రకటించనుంది.  బుధవారంతో అన్ లాక్ 4.0 ముగియనుంది.