ప్రెస్ మీట్ పెట్టిన వేమూరి అడ్డంగా బుక్ అయ్యారా?

Mon Sep 21 2020 10:45:11 GMT+0530 (IST)

Vemuri Harikrishna Prasad Comments On Lokesh Scams

ఏపీలో రాజకీయం ఇప్పుడెంత హాట్ హాట్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోని అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. తాజాగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లో రూ.2200లకు దొరికే సెటాప్ బాక్సును రూ.4400లకు కొనుగోలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.ఈ ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఐటీ రంగ ప్రముఖుడిగా పేరున్న వేమూరి హరికృష్ణప్రసాద్ హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ లో.. ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. బాబు.. చినబాబులకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టినట్లుగా చెబుతున్నారు.

ఫైబర్ గ్రిడ్ ఫైలుపై మంత్రి నారా లోకేశ్ సంతకం చేసిన వైనాన్ని అంగీకరించారు. అంతలోనే.. సర్దుకున్న ఆయన.. లోకేశ్ సంతకం చేయలేదని బుకాయించటం ఇప్పుడు పాయింట్ గా మారింది. అంతేకాదు.. సెట్ టాప్ బాక్సుల్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీలో ఉత్పత్తి చేసినట్లుగా వేమూరి అంగీకరించారు. అయితే.. కేవలం 40వేల బాక్సుల్ని మాత్రమే గల్లా కంపెనీలో ఉత్పత్తి అయినట్లుగా పేర్కొన్నారు.

ఇలా ఒక్కొక్కటిగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు బాబు.. చినబాబులకు తలనొప్పులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఏపీ సర్కారు చేపట్టే విచారణకు తాను సిద్దమని.. అందుకు సహకరిస్తానని చెప్పిన వేమూరి.. తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేసినా.. వేధింపులకు గురి చేసినా కోర్టును ఆశ్రయిస్తానని పేర్కొనటం గమనార్హం. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు టెండర్ కమిటీలో తాను లేనని వేమూరి స్పష్టం చేస్తున్నారు.

తాను కేవలం సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన వేమూరి హరికృష్ణప్రసాద్ చెబుతున్నారు. టెండర్ దక్కించుకున్న సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. సెట్ టాప్ బాక్సు ఒక్కొక్కటి రూ.3700లకు కొనుగోలు చేశామన్నారు. పది లక్షల బాక్సులకు టెండర్లు వేస్తే.. సుమారు ఏడు సంస్థలు పాల్గొన్నట్లుగా చెప్పారు. తక్కువ ధరకు ఉన్న సంస్థల్ని ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. ప్రెస్ మీట్ లో చెప్పిన పొంతనలేని సమాధానాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుందని చెప్పక తప్పదు.