Begin typing your search above and press return to search.

సంచలనం : బాంబు లాంటి లేఖతో సర్కారుకు వాజే షాక్

By:  Tupaki Desk   |   8 April 2021 4:30 AM GMT
సంచలనం : బాంబు లాంటి లేఖతో సర్కారుకు వాజే షాక్
X
మహారాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పోలీసు అధికారి సచిన్ వాజే.. తాజాగా మరో షాకిచ్చారు. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. ఎన్సీపీకి చెందిన ఆ నేతపై వాజే తీవ్రమైన ఆరోపణలు చేయటం తెలిసిందే. వ్యాపార దిగ్గజం.. దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంటి ముందు ఆయుధాల వాహనాన్ని కనుగొనటం.. అనంతరం ఈ ఎపిసోడ్ లో వాజేను నిందితుడిగా పేర్కొంటూ ఎన్ఐఎన్ అదుపులోకి తీసుకొని విచారించటం తెలిసిందే.

ఇందులో భాగంగా.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రూ.100 కోట్లు వసూలు చేయమన్నారంటూ ఆరోపణలు చేశారు. ఇది సంచలనంగా మారటమే కాదు.. చివరకు హోం మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది సరిపోనట్లు తాజాగా ఎన్ఐఏకు రాసిన నాలుగు పేజీల లేఖ ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. మహా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తోంది. తాజా లేఖలో మరో ఇద్దరు మంత్రులపైనా వాజే ఆరోపణాస్త్రాల్ని సంధించారు. వారికి సంబంధించిన విషయాల్ని వెల్లడించారు.

2004లో ఒక కేసుకు సంబంధించి వాజేను సస్పెండ్ చేయగా.. తిరిగి 2020లో విధుల్లోకి తీసుకున్నారు. తనను తీసుకోవద్దని పవార్ చెప్పారని.. ఆ సమయంలో హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రూ.2కోట్లు ఇస్తే తాను శరద్ పవార్ తో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పినట్లు వెల్లడించారు. తాను అంత మొత్తం ఇవ్వలేనని పేర్కొన్నాడు. సౌత్ ముంబయిలోని ఒక గెస్టు హౌస్ లో ఒక సమావేశంలో సైఫీ ఖుర్హానీ అప్ లిఫ్ట్ మెంట్ ట్రస్టు పై విచారణ గురించి తనతో హోంమంత్రి మాట్లాడారని.. రూ.50 కోట్లు ఇస్తే విచారణ ముగిస్తామని చెప్పి.. ఆ మొత్తాన్ని ట్రస్టు నుంచి వసూలు చేయమని చెప్పారన్నారు.

అనంతరం ముంబయిలోని 1650 బార్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని.. ఒక్కో బార్ నుంచి రూ.3 నుంచి రూ.3.5కోట్ల రాబట్టాలని చెబితే.. అది తన పరిధిలో లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో శివసేన మంత్రి అనిల్ పరబ్ పిలిచి.

ముంబయి కార్పొరేషన్ లో యాభై మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున వసూలు చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సన్నిహితుడంటూ దర్శన్ అనే వ్యక్తి కలిశాడని.. అక్రమ గుట్కా వ్యాపారస్తుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. తాను చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయనని చెబితే.. ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని చెప్పారన్న వాజే ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. మహారాష్ట్ర సర్కారును తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉన్న ఈ లేఖలోని ఆరోపణలపై ఉద్ధవ్ సర్కారు ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అయినా.. డిపార్ట్ మెంట్ లో అంతమంది అధికారులు ఉంటే.. పలువురు మంత్రులు వాజేనే పిలిపించుకొని దందా గురించి మాట్లాడటం.. టార్గెట్లు ఇవ్వటం ఏమిటో?