వైసీపీని వీడి!... రాధా తప్పు చేశారా?

Tue Jan 22 2019 20:00:01 GMT+0530 (IST)

Vangaveeti Fans Hurts with Vangaveeti Radha To Joins TDP

రాజకీయంగా మంచి పరిణతి కలిగిన ఓటర్లున్న విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీకి ఓ మంచి ఇమేజి ఉందన్నది ఏ ఒక్కరూ కాదనలేని సత్యమే. ఒక్క విజయవాడనే కాకుండా కాపులు అధికంగా ఉండే కోస్తాంధ్ర - ఉత్తరాంధ్రల్లోనూ వంగవీటి ఫ్యామిలీ అంటే అభిమానం చూపే వారు చాలా మందే ఉన్నారు. వంగవీటి రంగా మాటే వేదంగా సాగిన వీరంతా ఇప్పుడు రంగా రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణకు కూడా బాసటగానే నిలుస్తున్నారని చెప్పక తప్పదు. అయితే కాలక్రమంలో - రాధా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఈ అభిమాన గణం నానాటికీ తగ్గిపోతోందన్న వాదన కూడా లేకపోలేదు. మొత్తంగా వంగవీటి రంగా అడుగుజాడల్లో నడవడంతో పాటు రంగా ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడంలో రాధా ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నారన్నది ఆయన అభిమానుల భావనగా కనిపిస్తోంది. తాజాగా తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీని వీడిన రాధా... తన తండ్రి హత్యకు కారకురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీలో చేరుతుండటంపై ఆయన అభిమానులు ఇప్పడు చాలా ఆగ్రహంగానే ఉన్నట్లుగా కూడా విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే బయటకు ఒక్క మాట కూడా రాధాకు వ్యతిరేకంగా మాట్లాడేంత సాహసం చేయని ఫ్యాన్స్... రాధా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తమ పరిస్థితి ఏమవుతోందన్న ఆందోళనలో కూరుకుపోయారని మాత్రం చెప్పక తప్పదు.అయినా వైసీపీలో రాధాకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులేమున్నాయన్న విషయంపై ఓ సారి లుక్కేస్తే... చాలా ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న రంగా ఫ్యామిలీ... రంగా హత్య తర్వాత కూడా అదే పార్టీలో కొనసాగింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయవాడ తూర్పు నియోజజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాధా... 2009 ఎన్నికలకు కాస్తంత ముందుగా మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లోనూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన మల్లాది విష్ణు చేతిలో రాధా ఓటమి చెందారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన రాధా... గడచిన ఎన్నికల్లో మళ్లీ తన సొంత నియోజకవర్గం విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ప్రచారంలో మంచి ఊపు కనిపించినా... ఫలితాల్లో మాత్రం రాధా వెనకబడిపోయారు. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు... రాధాను 15 ఓట్ల పై చిలుకు మెజారిటీతో ఓడించారు. అంటే మొత్తంగా మూడు పర్యాయాలు పోటీ చేసిన రాధాకృష్ణ ఒక్క సారి మాత్రమే విజయం సాధించగా... మిగిలిన రెండు సార్లు కూడా ఓటమిపాలయ్యారు. గడచిన రెండు పర్యాయాయాలు కూడా ఆయన ఓటమినే చవిచూశారు.

అయినా కూడా రంగా ఫ్యామిలీకి ప్రజల్లో ఉన్న గుర్తింపు దృష్ల్యా వైసీపీ రాధాకు మంచి ప్రాధాన్యమే ఇచ్చింది. ఎన్నికల్లో రాధా లాంటి నేత గెలిస్తే.. పార్టీకి బాగానే మైలేజీ వస్తుందని కూడా ఆశించింది. ఆ క్రమంలోనే పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా రాధాకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. మల్లాది విష్ణు వైసీపీలో చేరేదాకా పార్టీలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చిన రాధా... విష్ణు చేరికతో కాస్తంత ఇబ్బంది పడినట్టుగా కనిపిపించింది. అయితే విష్ణు రాకతో రాధాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని - రాధా ఏకైక పర్యాయం గెలిచిన తూర్పు నియోజకవర్గం ఆయన కోసమే రిజర్వ్ గా ఉందని కూడా సంకేతాలు పంపింది. పార్టీ సీనియర్లు కూడా రాధాకు ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు. అయితే రాధా తనకు ఓటమిని చవిచూపించిన విజయవాడ సెంట్రల్ సీటే కావాలని పట్టుబట్టారు. అయితే ఆ నియోజకవర్గంలో కాపుల కంటే బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని వెరసి రాధా కంటే కూడా విష్ణు ఈజీగా గెలుచుకుని రాగలరని పార్టీ భావించింది. తూర్పు నుంచి పోటీకి ఇష్టం లేకపోతే... ఏకంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నా ఇబ్బంది లేదని - మచిలీపట్నం నుంచి రాధా పోటీతో పార్టీకి కూడా మేలు జరుగుతుందని కూడా చెప్పింది. అయితే ఈ ప్రతిపాదనకు కూడా రాధా ఒప్పుకోకపోగా... తనకు సెంట్రల్ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు. అయితే అక్కడ ఆల్రెడీ ఓసారి ఓడిపోయారు కదా... ఇప్పుడు రిస్క్ ఎందుకంటూ పార్టీ ఆయనను ఒప్పించేందుకు పార్టీ సీనియర్లు విశ్వ ప్రయత్నం చేశారు.

ఈ ఎన్నికల్లో ఓడినా కూడా ఎమ్మెల్సీ ఖాయమంటూ స్వయంగా జగనే ఆయనకు హామీ ఇచ్చారు. అయినా కూడా మొండిపట్టుదలతోనే ముందుకు సాగిన రాధా... మొన్న వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే వైసీపీకి  గుడ్ చెప్పిన రాధా నిర్ణయం పట్ల ఆయన అభిమాన గణానికి ఇష్టం లేదనే చెప్పాలి. ఇంతగా ప్రాధాన్యం ఇచ్చిన పార్టీని కాదని వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని కూడా కొందరు సన్నిహితులు ప్రశ్నించారట కూడా అయినా కూడా వినని రాధా... వైసీపీకి రాజీనామా చేసేశారు. మరి ఇప్పుడు ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఏమిటన్న విషయానికి వస్తే... వైసీపీకి రాజీనామా చేసిన రాధా... పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేనలో చేరతారని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ముందుకు సాగుతున్న రాధా.. ఏకంగా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర తాంబూలం ఇచ్చిన వైసీపీని కాదని ఓ పొరపాటు చేసిన రాధా... ఇప్పుడు తండ్రిని చంపేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ చేరేందుకు నిర్ణయించుకోవడం రంగా ఫ్యాన్స్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందనే చెప్పాలి. ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీని కాదని బయటకు వచ్చి... టీడీపీలో చేరడమేంటని రాధా ప్యాన్స్ ఇప్పుడు బహాటంగానే ఆవేదన వెళ్లగక్కుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.