Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌ల‌పై వ‌ల్ల‌భ‌నేని ప‌రువున‌ష్టం దావా.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   30 Jan 2023 2:04 PM GMT
టీడీపీ నేత‌ల‌పై వ‌ల్ల‌భ‌నేని ప‌రువున‌ష్టం దావా.. రీజ‌న్ ఇదే!
X
టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌.. ఎన్నిక‌లు అయ్యాక‌.. అధికార పార్టీ వైసీపీకి మ‌ద్ద‌తు దారుగా మారిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు, పార్టీ నేత‌లకు మ‌ధ్య కొన్నాళ్లుగా మాట‌ల యుద్ధం కూడా కొన‌సాగుతోంది. గ‌తంలో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల‌పైనా.. వంశీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇదిలావుంటే, తాజాగా టీడీపీ గన్నవరం ఇంచార్జి బచ్చుల అర్జునుడు, మ‌రో నేత‌, పార్టీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి పట్టాభిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం కోర్టులో పరువునష్టం దావా వేశారు.

ఈ సంద ర్భంగా వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ''2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచాను. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పథకాలకు ఆయాకర్షితుడనై మద్దతు తెలిపాను. దీంతో టీడీపీకి చెందిన కొంద‌రు నాపై సోషల్ మీడియా స‌హా కొన్ని పత్రికల్లో దుష్ప్రచారం చేశారు'' అని వ్యాఖ్యానించారు.

టీడీపీకి మద్దతుగా ఉంటే ఒకలా బయటకు వస్తే మరోలా దుష్ప్రచారం చేయడం అలవాటుగా మారింద‌ని వంశీ అన్నారు. విజయవాడలో సంకల్ప సిద్ధిలో అవినీతి జరిగిందని కొన్ని మీడియాల ద్వారా తెలిసిందన్నారు.

రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి కూడా పాల్పడలేద‌ని వంశీ చెప్పారు. అయినా కూడా త‌న‌పై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు.

టీడీపీకి చెందిన పట్టాభి, బచ్చుల అర్జునుడు తీవ్ర పదజాలంతో అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ''నేను, కొడాలి నాని కోట్లు అవినీతి చేసి బెంగుళూరులో ఆస్తులు కొన్నట్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయం పై గతంలో ఇచ్చిన నోటీస్ కి రిప్లై ఇవ్వలేదు. ఈ కారణంగానే గన్నవరం కోర్టుని ఆశ్రయించాను'' అని వంశీ వివ‌రించారు. ''నాపై కావాలని తీవ్ర పదజాలంతో మీడియాలో ప్రకటనలు చేసిన వారికి శిక్ష వేయాలని కోరుతున్నాను.'' అని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.