Begin typing your search above and press return to search.

రాజకీయాల్లో ఇలాంటివి ఇంకెప్పటికి సాధ్యం కాదు బాస్!

By:  Tupaki Desk   |   20 Aug 2019 2:30 PM GMT
రాజకీయాల్లో ఇలాంటివి ఇంకెప్పటికి సాధ్యం కాదు బాస్!
X
చరిత్రను తిరగేసినా.. జరిగిపోయిన ఘటనలు గుర్తుకు తెచ్చుకున్నా అరేరే.. ఎలాంటి రోజుల్లో నుంచి ఎలాంటి రోజుల్లోకి వెళుతున్నామన్న భావన కలగక మానదు. ఒకప్పుడు చట్టసభల్లో ప్రతిపక్ష నేత దుమ్మెత్తి పోస్తూ విమర్శిస్తే.. బయటకు వచ్చినంతనే.. బాగా మాట్లాడావ్ అని అభినందించే పరిస్థితి. ఇప్పుడు అధికార.. విపక్ష నేతలు ముఖముఖాలు సైతం చూసుకోలేని దుస్థితి.

పోయినోళ్లంతా మంచోళ్లు అని ఊరికే అనలేదేమో? జరిగిపోయిన కాలం స్వర్ణయుగంగా పలువురు అభివర్ణిస్తుంటారు. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాల వరకూ వస్తే మాత్రం.. గతంలో జరిగినవి ఇప్పుడు చెబితే.. ఒక పట్టాన నమ్మలేరు కదా.. కథలు చెబుతున్నారన్న మాటను అనేసినా ఆశ్చర్యం లేదు. ఇందుకు శాంపిల్ గా కొన్ని ఉదంతాల్ని చెప్పాల్సి వస్తే..

% అప్పట్లో.. అటల్ బిహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. అప్పటివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఉంటూ వచ్చిన నెహ్రూ చిత్రపటం కనబడకపోవడాన్ని ఆయన గమనించారు. నెహ్రూ ఫోటోను తక్షణం అక్కడ పెట్టాలని ఆదేశించారు. ఆ వెంటనే అక్కడ నెహ్రూ ఫోటో వచ్చేసింది. అలాంటివి ఇప్పుడు సాధ్యమా?

% పార్లమెంటులో ప్రసంగిస్తూ వాజ్ పాయ్ ఆనాటి ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. ఆ సాయంత్రం అటల్ బిహారీ వాజ్ పాయ్ పార్లమెంటు హాలులో కలిసినప్పుడు నెహ్రూ ఆయన భుజం తట్టి ‘బాగా మాట్లాడావు’ అని మెచ్చుకున్నారు.

% వాజ్ పాయి ముందు విదేశాంగ మంత్రి అయ్యారు. తరువాత అదే పదవిని పీవీ నరసింహా రావు స్వీకరించారు. వాజ్ పాయి వ్యక్తిగత సిబ్బందిని అందర్నీ కొనసాగించడానికి పీవీ నిర్ణయించారు.

% వాజ్ పేయ్ కంటే ముందు పీవీ ప్రధాని అయ్యారు. తరువాత అదే పదవిని వాజ్ పాయ్ అలంకరించారు. అప్పటికే పీవీ.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అణుపరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా వాజ్ పాయ్ ప్రభుత్వం వచ్చింది. పీవీ ఎవరూ గమనించకుండా వాజ్ పాయ్ చేతిలో ఒక చీటీ పెట్టారు. “అణుపరీక్షకు సర్వం సంసిద్ధంగా వుంది. ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మీపై వుంది” అని. పీవీ సలహాను వాజ్ పాయ్ పాటించారు. పోఖ్రాన్ లో అణుపరీక్షను జయప్రదంగా నిర్వహించారు. పీవీ మరణించినప్పుడు ఇచ్చిన సంతాప సందేశంలో వాజ్ పాయ్ ఈ సంగతి వెల్లడించే వరకు ఈ విషయం గోప్యంగానే వుంది.

% పీవీ ప్రధానమంత్రి - జెనీవాలో జరిగిన మానవహక్కుల సదస్సుకు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్ పాయ్ నాయకత్వంలో భారత ప్రతినిధివర్గాన్ని పంపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందివారిని కాకుండా విపక్షానికి చెందిన వ్యక్తిని పీవీ ఎంపిక చేయడం ఆ పార్టీవారికి రుచించలేదు. అలాగే బీజేపీ వారికి కూడా వాజ్ పాయ్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించడం పట్ల అభ్యంతరాలు వున్నాయి. కానీ భారత ప్రతినిధివర్గం నాయకుడిగా జెనీవా సదస్సులో వాజ్ పాయ్ ప్రసంగించిన తీరు - భారత దేశ విధానాన్ని వ్యక్తం చేసిన పద్దతి ఆ తర్వాత అందరి ఆమోదాన్ని పొందింది.

% పీవీ రాసిన పుస్తకాన్ని వాజ్ పేయ్ ఆవిష్కరిస్తే.. వాజ్ పేయ్ రాసిన పుస్తకాన్ని పీవీ ఆవిష్కరించారు. పాలక.. ప్రతిపక్షాలుగా ఉప్పు.. నిప్పులా ఉంటూ కొట్లాడుకుంటూనే.. రాజకీయాల్లో గౌరవించదగ్గ హుందాతనాన్ని కాపాడిన వైనాన్ని ఇవాల్టి రాజకీయాల్లో ఊహించగలమా?

అప్పటి రాజకీయాల గురించి ఇన్ని చెప్పుకున్నాం. ఇప్పటి రాజకీయాల గురించి ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకట్రెండు ఉదాహరణలు చాలు.. రాజకీయం ఎంతగా భ్రష్టు పట్టి పోయిందో అర్థం కావటానికి. సొంత మామను వెన్నుపోటు పొడిచి.. ఆయన్ను అధికారంలో నుంచి దించేసి.. తాను ముఖ్యమంత్రి సీటులో కూర్చున్న చంద్రబాబు రాజకీయాల్లో విలువల్ని ఎంతగా దిగజార్చాలో అంతగా దిగజారిస్తే.. సొంత మేనల్లుడి ఫోటోను సొంత పత్రికల్లో రావటానికి కూడా ఇష్టపడక.. అతడి స్థానాన్ని అంతకంతకూ తగ్గించేసే కేసీఆర్ లాంటి అధినేతలు పాలకులుగా ఉన్న కాలంలో హుందాతనం గురించి.. విలువల గురించి మాట్లాడం బాగోదేమో?