Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో హనుమ రాయబారం

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:30 PM GMT
కాంగ్రెస్ లో హనుమ రాయబారం
X
కాంగ్రెస్ పార్టీ అంటేనే.. పెద్ద సముద్రం. అందులో వర్గాల గురించి చెప్పేదేం లేదు. ఒక విధంగా చూస్తే.. అందువల్లనేనేమో కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ మనుగడలో ఉన్నదని అనిపిస్తుంది. అంతర్గత ప్రజాస్వామ్యం అత్యంత అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఎప్పడూ ఏదో ఒక గ్రూపు నిరసన స్వరం వినిపిస్తూనే ఉంటుంది.

ఇది జాతీయ స్థాయిలోనే కాదు.. రాష్ట్ర స్థాయిలోనూ అత్యంత సహజం. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పడు.. గత 30 ఏళ్లనే ప్రామాణికంగా తీసుకుంటే, నేదురుమల్లి, కోట్ల, వైఎస్ ఇలా అనేక వర్గాలుండేవి. తెలంగాణ వచ్చాక సైతం ఇదే ధోరణి కొనసాగుతోంది. ఆ క్రమంలో నాయకులను ఒకదారికి తేవడం కోసం సీనియర్ నేత వీహెచ్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఆయన చేపట్టిన రాయబారంపై పార్టీలో ప్రస్తుతం చర్చ బాగా నడుస్తోంది. అయితే, అసమ్మతిని దారిలోకి తేవడం ఆయనకు సాధ్యం అవుతుందా. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అగ్రనాయకులు అసలు ఆయన ప్రయత్నాన్ని పట్టించుకుంటున్నారా?

అన్నది చర్చనీయాంశంగా మారింది.ఆ సోదరులతో..

రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించాక పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు. జిల్లా అంతటా ప్రభావం చూపగల వారిని వదులు కోవడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు. అందుకని ఆ సోదరుల గుమ్మం వరకు వెళ్లి పిలిచే పరిస్థితి కనిపించడం లేదు.

అయితే, కోమటిరెడ్డి సోదరులను బుజ్జగించి పార్టీ కార్యక్రమాలకు వచ్చేలా రాయబారం నెరిపే బాధ్యతను సీనియర్ నేత,మాజీ ఎంపీ వీహెచ్ కు అప్పగించింది పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ. దీనిప్రకారం వీహెచ్, కోమటిరెడ్డి సోదరుల మధ్య చర్చలు సాగాయి. కొనసాగుతూనే ఉన్నాయి. ఎంతవరకు వచ్చాయో? కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీ దారిలోకి వస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది.

రైతు ప్రదర్శనల్లో కనిపించని సోదరులు.. జగ్గారెడ్డి

ప్రజా బలం, క్యాడర్ బలం ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌కు అసలు సమస్య నాయకుల్లో ఐక్యతా లోపం. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై ఇటీవల ఢిల్లీలో పార్టీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.

హైకమాండ్‌ ఆగ్రహంతోనో ఏమో.. ఇటీవల జరిగిన రైతు యాత్రలో నాయకులు కుదురుకున్నట్టు కనిపించారు. ఉత్తమ్, రేవంత్, భట్టి రైతు ప్రదర్శనలో కలిసి నడిచారు. అంతకుమందు అధిష్ఠానంతో సమావేశంలో వీరు భిన్న దారుల్లో ఉండడం గమనార్హం. అయితే, సీనియర్ నేతల్లో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి రాలేదు.

నాకేం చెప్పడం లేదంటూ కోమటిరెడ్డి ఫిర్యాదు?

సమయం ఉన్నప్పుడు వచ్చి వెళ్తానని గతంలోనే జానారెడ్డి చెప్పేశారు. ఇక తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని.. పార్టీ ముఖ్య నాయకులు కనీసం సంప్రదించడం లేదని వీహెచ్ తో కోమటిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదని కూడా చెప్పారట. ఠాగూర్‌ వెళ్లాక కూడా కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు రాకపోతే మిగతావాళ్లూ అదే పంథాను అనుసరిస్తారని ఇంఛార్జ్‌కు సన్నిహితులుగా ఉండేవారి వాదన.

ఢిల్లీ భేటీకి పిలవకపోవడంపై జగ్గారెడ్డి కినుక..!

గ్గారెడ్డి వ్యవహారం కూడా అంతే. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత.. పీసీసీ లక్ష్యంగా ఆయన కొన్ని కామెంట్స్‌ చేశారు. ఆ తర్వాత సమావేశంలో తన వైఖరి స్పష్టం చేశారు. అయితే ఢిల్లీలో పార్టీ నిర్వహించిన సమావేశానికి తనను పిలవలేదని రాహుల్, సోనియాగాంధీలకు లేఖ రాశారు జగ్గారెడ్డి. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయబోనని చెప్పిన ఆయన కాంగ్రెస్‌ నిర్వహించిన రైతు ధర్నాలకు హాజరు కాలేదు.

ఢిల్లీ సమీక్షకు పిలవకపోవడంతో.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు వెళ్లాలని అనుకున్నారో.. సమాచార లోపమో కానీ జగ్గారెడ్డి తీరు ఎవరికీ అంతుచిక్కడం లేదు. అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇటు జగ్గారెడ్డిలను దారిలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.