నన్ను వ్యభిచారిణిగా మారాలన్నారు.. హత్యకు ముందు రిసెప్షనిస్ట్ సంచలన చాటింగ్ లీక్

Sun Sep 25 2022 15:08:53 GMT+0530 (India Standard Time)

Uttarakhand Resort Deceased Receptionist Ankita Bhandari Whatsapp Chat Viral

ఉత్తరాఖండ్ లో రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ హత్యలో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది.  బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్ కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్ లో కనిపించకుండా పోయిన రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19) హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో బీజేపీ నేత కుమారుడు అయిన పుల్ కిత్ ఆర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి చెందిన రిసార్ట్ ను ప్రభుత్వం కూల్చివేసింది.ఉత్తరాఖండ్ హరిద్వార్ కు చెందిన వినోద్ ఆర్య అనే బీజేపీ నేతకు పౌరీ జిల్లాలో ఓ రిసార్ట్ ఉంది. అందులో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి గత కొంతకాలంగా కనిపించకుండా పోయింది.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ యువతిని బీజేపీ నేత కుమారుడు రిసార్ట్ యజమానిగా ఉన్న పులకిత్ ఆర్య మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ లు కలిపి హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు.19 ఏళ్ల యువతి హత్యకు రిసార్ట్ యజమానే కారణమని ప్రాథమికంగా వెల్లడైంది. అతడితోపాటు రిసార్ట్ లో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా ఈ హత్య కేసు విచారణలో యువతి వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది. అది సంచలనమైంది. 'తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని..' వాట్సాప్ లో తన స్నేహితుడితో ఆమె చాట్ చేసింది. ఇదిప్పుడు పెను సంచలనమైంది. 'వారు నన్ను వేశ్యగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు' అని యువతి ఆందోళన చెందింది. రూ.10వేలకు గెస్ట్ లతో సెక్స్ చేయాలని రిసార్ట్ యజమాని ఒత్తిడి చేస్తున్నాడని వాపోయింది. 'నేను పేదదాన్నే కావచ్చు కానీ.. రూ.10వేల కోసం నన్ను నేను అమ్ముకోలేను' అని యువతి వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

'వినోద్ ఆర్య తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఓ అతిథి తాగిన మైకంలో తనను బలవంతంగా కౌగిలించుకున్నాడు' అని చనిపోయిన యువతి తన స్నేహితుడికి వాట్సాప్ లో చాట్ చేసింది. సమస్య పెద్దది కాకుండా ఉండడానికి మౌనంగా ఉండాలని  తనకు సూచించారని తెలిపింది.

ఇక ఓ గెస్ట్ రూ.10వేలు ఇస్తాడని.. అతడితో సెక్స్ చేయాలని  నిందితుడు ఆర్య అడిగాడనని.. దీనికి నేను నో చెప్పడంతోనే వారు సీరియస్ అయ్యారని చాట్ లో వాపోయింది. ఈ సేవ చేయడానికి అంగీకరించకపోతే నీ స్థానంలో మరో అమ్మాయిని నియమించుకుంటామని చెప్పారని.. ఇకపై తాను ఈ రిసార్ట్ లో పనిచేయననని.. నన్ను వేశ్యగా మారాలని కోరుకుంటున్నారనని తన స్నేహితుడికి బాధిత యువతి చాట్ లో ఆందోళన వ్యక్తం చేసింది.

హత్యకు గురైన యువతి తన స్నేహితురాలితో చేసిన వాట్సాప్ చాటింగ్ నిందితులు ఆమెను వ్యభిచారం చేయాలనే బలవంతం చేసినట్టు ఆరోపణలను బలపరిచింది. దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. ఏడుస్తూ రిసార్ట్ లోని మరో ఉద్యోగికి యువతి చేసిన ఫోన్ కాల్ కూడా వైరల్ గా మారింది. గెస్టుల కోసం బాధితురాలితో వ్యభిచారం చేయించేందుకు రిసార్ట్ యజమానికి ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

బాధిత యువతి రిసార్ట్ కు వచ్చే అతిథులతో శృంగారం చేసేందుకు నిరాకరించడం వల్లే ఈ హత్యకు పాల్పడినట్టు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ కూడా తాజాగా తెలిపారు. వాట్సాప్ చాటింగ్ పై విచారణ జరుపుతున్నామన్నారు.

ఇక రిసార్ట్ యజమాని రాష్ట్ర బీజేపీ నేత కొడుకు కావడంతోనే ఈ ఘటన దేశమంతటా సంచలనమైంది. ఘటనపై బీజేపీ సీరియస్ గా స్పందించింది. బీజేపీ నేత కొడుకును అరెస్ట్ చేసి ఆ రిసార్ట్ ను కూల్చివేయించింది. ఇక పులికిత్ ఆర్య సోదరుడు అకింత్ ఆర్యనువీరి తండ్రి వినోద్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.