దిశపై స్పందన..ఉపేంద్ర హీటెక్కించేశారే!

Sun Dec 08 2019 13:01:27 GMT+0530 (IST)

Upendra Statement Over Disha Accused Encounter

మానవ మృగాల చేతిలో హత్యాచారానికి గురైన దిశ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పోలీసుల చేతిలో నిందితులు ఎన్ కౌంటర్ అయిన వైనంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దిశపై హత్యాచారాన్ని యావత్తు దేశం ముక్తకంఠంతో ఖండిస్తే... నిందితుల ఎన్ కౌంటర్ పై మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిందితులకు శిక్ష పడాల్సిందేనని అయితే ఆ శిక్ష పోలీసుల చేతిలో కాకుండా కోర్టు బోనులో పడి ఉంటే బాగుండేదన్న మేధావుల వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నిందితులు క్షమార్హులు కాదని అంతా చెబుతున్నా.. శిక్ష అమలుపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరణంలో కొందరు ప్రముఖులు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంటే... మరికొందరు ప్రముఖుల కామెంట్లు చిచ్చు రేపుతున్నాయి. అలాంటి కోవకు చెందినవే కన్నడ నటుడు ఉపేంద్ర కామెంట్లు.దిశ ఘటన - ఎన్ కౌంటర్ పై ఉపేంద్ర తన ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్లు ఇప్పుడు పెను విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఓ వైపు ఆయన అభిమానులు ఆయనను వెనకేసుకుని వస్తుంటే... మెజారిటీ వర్గం ప్రజలు ఉపేంద్ర ట్వీట్ పై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా దిశ ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై తన మనసులోని మాటను బయటపెట్టిన ఉపేంద్ర పెద్ద రచ్చకే తెర తీశారని చెప్పక తప్పదన్న మాట. అయినా ఉపేంద్ర ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘ఆ నలుగురూ ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో... లేదో..? ఈ సంఘటన వెనుక ఎవరైనా ప్రముఖుల హస్తం ఉందేమో..? ఇదే తరహాలో ఎన్‌కౌంటర్‌లు ప్రముఖ వ్యక్తుల కేసుల్లో ఎందుకు జరగవు..? కోర్టులో విచారణలకు ముం దే ఎన్ కౌంటర్ ఇకపై ప్రముఖుల కేసుల్లోనూ రెడ్ కార్పెట్ కానుందా..?’ అంటూ ఉపేంద్ర తనదైన శైలిలో  కామెంట్ చేశారు.
 
అంతటితో ఆగని ఉపేంద్ర... ‘ఒకానొక కాలంలో ఎన్ కౌంటర్ ను రౌడీయిజం తగ్గించేందుకు సాగేవని - నిజాయితీ పోలీసు అధికారుల మనసు పెడితే ఎన్‌కౌంటర్ ద్వారా అత్యాచారాలను నియంత్రించవచ్చునని ప్రముఖులు - శ్రీ మంతులు దుర్వినియోగం చేసుకోకుండా అధికారులు హెచ్చరికగా ఉండాలి’ అని కూడా ఉపేంద్ర ట్వీట్ చేశారు. ఉపేంద్ర అలా ట్వీట్లు పెట్టగానే... ఇటు ఆయన అభిమానులు ఆయనకు మద్దతు ఇస్తూ రీ ట్వీట్టు పెట్టేస్తుంటే... మెజారిటీ వర్గం నెటిజన్లు ఉపేంద్ర కామెంట్లపై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తంగా ఉపేంద్ర ఓ పెద్ద రచ్చకే తెర లేపారన్న మాట. మరి ఈ రచ్చ ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.