ఎంత వెతికినా 'ఆరు' ఎక్కడా కనిపించట్లేదు కేసీఆర్?

Thu Sep 29 2022 12:32:05 GMT+0530 (India Standard Time)

Update on Chief Minister KCR National Party

కేసీఆర్ అన్నంతనే చాలా విషయాలు గుర్తుకు వస్తుంటాయి. ఆయన మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయి? ఆయన చేతల సంగతి? ఏ సందర్భానికి ఎలా స్పందిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. తనకు సానుకూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఒకలా.. అందుకు భిన్నంగా ప్రతికూలంగా ఉన్న వేళలో మరోలా వ్యవహరించటం తెలిసిందే. అన్నింటికి మించి.. ముహుర్తాలు.. జాతకాలు.. ఇలాంటి వాటిపైన ఆయన నమ్మకాలు అన్ని ఇన్ని కావు.తాను ఏదైనా కొత్త కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నా.. పెద్ద ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు తనకు శుభం కలిగించే.. లక్కీ నెంబరు '6' మిస్ కాకుండా చూసుకుంటారు. తాజాగా ప్రధాని మోడీ మీద యుద్ధానికి సై అంటూ జాతీయ రాజకీయ పార్టీని సిద్ధం చేస్తున్న కేసీఆర్.. వచ్చే నెల ఐదున అంటే.. దసరా రోజున పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే.

తన రోటీన్ సెంటిమెంట్ కు భిన్నంగా.. ఆయన ఎంచుకున్న తేదీ కానీ.. సమయం కానీ ఎందులోనూ 'ఆరు' అన్నది లేకుండా ఉండటం విశేషం. అయితే.. ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా.. పెద్ద పని పెట్టుకున్నా.. దాన్ని దసరా రోజున తేదీలు.. వారాలతో సంబంధం లేకుండా షురూ చేయొచ్చన్న సెంటిమెంట్ దిశగా కేసీఆర్ ఆలోచనలు సాగి ఉంటాయని చెబుతున్నారు.

తన జాతీయ పార్టీ ప్రకటనను వెల్లడించే తేదీని చూస్తే.. 05-10-2022. ఇందులో విడిగా చూసినా.. మొత్తం కలిపి చూసినా '6' మిస్ అయిన విషయం కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని కలిపితే వచ్చేది  5+10+2+22= 39 అవుతుంది. దీన్ని మళ్లీ 3+9 కలిపితే 12 అవుతుంది. దాన్ని 1+2=3 అవుతుంది.

సాధారణంగా ఈ మొత్తం '6' వచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తుంటారు. అందుకు భిన్నంగా తాజా వ్యవహారంలో మాత్రం ఆయన దాన్ని పట్టించుకోలేదు. ఇక.. జాతీయ పార్టీని ప్రకటించే ముహుర్తాన్ని చూసినా కూడా అందులోనూ ''6'' కనిపించదు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఐదో తేదీ మధ్యాహ్నం 1:19 గంటలకు ప్రకటిస్తున్నారు. దీన్ని కలిపినా 1+19=20 అవుతుంది. అంటే.. 2 అవుతుంది. ఒకవేళ.. తేదీ.. నెల.. ఏడాదితో పాటు ఎంచుకున్న ముహుర్త సమయాన్ని కలిపినా.. 3+2=5 అవుతుందే తప్పించి ఆరు కనిపించని పరిస్థితి.

సెంటిమెంట్ కు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్.. తన రాజకీయ భవిష్యత్తును భారీ మలుపు తిప్పే జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించి  ఎక్కడా కూడా '6' లేకపోవటం ఆసక్తికరంగా మారింది. తన సెంటిమెంట్ కు భిన్నంగా చేస్తున్న జాతీయ ప్రకటన వ్యవహారం ఆయన్ను ఎక్కడవరకు తీసుకెళుతుందన్నది కాలమే సరైన సమాధానం చెబుతుందేమో?నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.