Begin typing your search above and press return to search.

వాడని టీకాలు 23 కోట్లా !

By:  Tupaki Desk   |   8 Dec 2021 11:31 AM GMT
వాడని టీకాలు 23 కోట్లా !
X
దేశవ్యాప్తంగా ఒకవైపు కోవిడ్ టీకాలు అందక జనాలు అల్లాడిపోతున్నారు. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం కేటాయించిన టీకాలను అసలు వాడనేలేదు. దేశవ్యాప్తంగా వాడని కోవిడ్ టీకాల సంఖ్య 23 కోట్లని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటులో లెక్కలు చెప్పింది.

ఉపయోగించని టీకాలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్లో ఉన్నట్లు చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల బీజేపీ ప్రభుత్వాలే ఉండటం.

తాజా లెక్కల ప్రకారం యూపీలో ఒక్క డోసుకూడా వేసుకోని వారిసంఖ్య 3.5 కోట్లట. బీహార్లో 1.89 కోట్లు, మహారాష్ట్రలో 1.7 కోట్లు, తమిళనాడులో 1.24 కోట్లమంది ఉన్నట్లు చెప్పింది.

పైన చెప్పిన ఐదు రాష్ట్రాల్లోనే 11 కోట్ల డోసులు మిగిలిపోతే పై రాష్ట్రాల్లోని లెక్కల ప్రకారం మిగిలిన కోట్లాది డోసులున్నాయి. జనాలకు ఒక్క డోసు కూడా వేయించకుండా ఈ రాష్ట్రాలు ఏమి చేస్తున్నాయో అర్ధం కావటంలేదు.

కరోనా వైరస్ తీవ్రత తగ్గాలంటే కచ్చితంగా 2 డోసుల టీకాలను వేసుకోవాల్సిందే అని కేంద్రప్రభుత్వంతో పాటు వైద్య నిపుణులు, శాస్త్రజ్ఞులు నెత్తి నోర మొత్తుకుంటున్నారు.

జనాల్లో చైతన్య తెచ్చేందుకని ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలను చేపడుతునే ఉన్నాయి. అయినా దేశంలో 23 కోట్ల డోసులు మిగిలిపోయాయని, కోట్లాదిమంది ఇంకా మొదటి డోసు కూడా వేసుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో భారత్ నుండి తమకు కోవిడ్ టీకాలు కావాలంటు చాలా దేశాలు తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నాయి.

భారత్ లో తయారవుతున్న కోవీషీల్డ్, కో వ్యాగ్జిన్ టీకాలను 94 దేశాలకు ఎగుమతయ్యాయి. వివిధ దశల్లో ఇప్పటివరకు 7.5 కోట్ల డోసులు పంపినట్లు కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది.

ఇక కోవిడ్ మందులు, ఇతర సమాగ్రిని 150 దేశాలకు అందించినట్లు చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ లో ఒక్కడోసు కూడా వేసుకోని వారు 3.5 కోట్లమంది ఉన్నారంటే అది సమాజ్ వాదీ పార్టీ మహిమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఎందుకంటే కోవిడ్ టీకాలు వేసుకోవద్దని ఆ టీకాలన్నీ బీజేపీ టీకాలంటు మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. నిజానికి టీకాల్లో బీజేపీ టీకాలని, కాంగ్రెస్ టీకాలని ఉండవని అఖిలేష్ కు కూడా బాగా తెలుసు.

కానీ జనాలను కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకని అఖిలేష్ పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ వ్యాఖ్యల ప్రభావం ముస్లిం మైనారిటీలపై బాగా పనిచేసిందని ప్రచారంలో ఉంది.