Begin typing your search above and press return to search.

అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్న జమున

By:  Tupaki Desk   |   19 July 2021 8:30 AM GMT
అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్న జమున
X
ఒకవైపు ఉపఎన్నికలో గెలవటం చావో రేవో అన్నట్లుంటే మరోవైపు మాజీమంత్రి ఈటల రాజేందర్ భార్య జమున అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రాబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను పోటీచేసినా తన భర్త ఈటల పోటీచేసినా ఒకటే అని చెప్పటమే విచిత్రంగా ఉంది. తెలంగాణా ఉద్యమ సమయంలో తన భర్తవెంటే తాను కూడా ఉన్నట్లు జమున ఇఫుడు గుర్తుచేస్తున్నారు. ఉపఎన్నికలో తామిద్దరిలో ఎవరు పోటీచేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదట.

విచిత్రమేమిటంటే ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు పోటీ చేయాలని మాత్రం అనుకున్నారట. తామిద్దరిలో ఎవరు పోటీచేసినా గుర్తు మాత్రం అదే ఉంటుందని చెప్పటం కాస్త ఓవర్ గానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మైనస్ ఈటల ఆయన భార్య జమున జీరో అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమ సమయంలో ఈటల భార్య యాక్టివ్ గా పాల్గొన్న విషయం చాలామందికి తెలీదు. బహుశా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారేమో.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంఎల్ఏగా మంత్రిగా పపిచేసి, బర్తరఫ్ అయ్యారు కాబట్టే ఈటలపై జనాల్లో సానుభూతి ఉంది. అంతమాత్రాన కేసీయార్ వ్యూహాలను చిత్తుచేసి బీజేపీ అభ్యర్ధిగా గెలిచేస్తారనే గ్యారెంటీ ఏమీలేదు. ఎందుకంటే పార్టీ బీజేపీ బలం నియోజకవర్గంలో సున్నాయే. ఈటలకు పడే ప్రతి ఓటు తనను చూసి పడాల్సిందే. తనకు ఎన్ని ఓట్లు పడతాయో, గెలుపు అవకాశం ఎంతుంటుందో ఈటలే చెప్పలేకపోతున్నారు. ఏదో గంభీర్యంగా గెలుపు తనదే అని పైకి చెప్పుకుంటున్నారన్న విషయం తెలిసిపోతోంది.

కాకపోతే ఎలాగైనా గెలవాలన్న కసుంది కాబట్టే నియోజకవర్గంలో పట్టుదలగా ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ కూడా ఉపెన్నికలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకనే మంత్రులు, ఎంఎల్ఏలను ఇన్చార్జీలుగా నియమించి ప్రతిరోజు పరిస్దితిని సమీక్షిస్తున్నారు. రెగ్యులర్ గా పార్టీ పరిస్ధేంటి ? అభ్యర్ధి ఎవరైతే బాగుంటుందనే విషయాలపై నేతలతో మాట్లాడుతు, జనాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు.

సరే కాంగ్రెస్ వ్యూహాలేంటనేది ఇప్పటికైతే సస్పెన్సుగానే ఉంది. ఏదేమైనా ఉపఎన్నికలో పోటీ ఈటలకు జీవన్మరణ సమస్యగా మారిపోయిందనేది నిజం. ఇలాంటి పరిస్ధితిలో తామిద్దరిలో ఎవరు పోటీ చేస్తామో తెలీదని ? ఎవరు పోటీచేసినా ఒకటే అని జమున చెప్పటమంటే కాస్త ఓవర్ గానే అనిపిస్తోంది. పోటీలో ఈటల ఉంటే ఒక విధంగా ఆయన భార్య పోటీచేస్తే పరిస్ధితిలు మరోరకంగా మారిపోతాయనటంలో సందేహమేలేదు. ఈటల కాకుండా భార్య పోటీచేస్తే పనిచేసే మద్దతుదారుల వైఖరిలో కూడా మార్పువచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నేతల స్ట్రాటజీలు డా మారిపోతాయి.

ఉపఎన్నికలో ఈటల పోటీచేస్తేనే ఫైట్ టైట్ గా ఉంటుందని సమాచారం. తాజాగా జమున ప్రకటన చూసిన తర్వాత రాబోయే ఉపఎన్నికలో ఈమే పోటీలో ఉంటుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అదే జరిగితే ఇటు ఈటలకు వ్యక్తిగతంగానే కాకుండా అటు బీజేపీ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవేమో అనే ప్రచారం మొదలైపోయింది. ఈటల కాకుండా ఆయన భార్య పోటీచేస్తానంటే మరి బీజేపీ నేతలు ఏమంటారో తెలీదు. మరీ విషయాలు ఆలోచించకుండానే జమున ప్రకటించారా ? లేకపోతే కేసీయార్ ను కన్ఫ్యూజ్ చేయటంలో ఇదేమన్నా వ్యూహమా అన్నది అర్ధం కావటంలేదు.