రైతులంటే బీజేపీకి అంత చులకనా!

Wed Dec 01 2021 23:00:02 GMT+0530 (IST)

Union Minister Tomar made controversial remarks on farmers

కేంద్రమంత్రి తోమర్ రైతు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతాంగ ఉద్యమాన్ని హేళన చేసే విధంగా మాట్లాడారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో చనిపోయిన రైతులను కించపరిచేలా మాట్లాడారు. అది కూడా పార్లమెంట్ లో తోమర్ మాట్లాడడం గమనార్హం. సాగు చట్టాలకు రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన నిరసనలో రైతుల మరణాలకు సంబంధించిన రికార్డు లేదని తోమర్ తెలిపారు. రైతుల నిరసనలో భాగంగా కొందరు రైతులు మరణించారని వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే ఆలోచన ఉందా? అని పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు తోమర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. రైతులు చనిపోయారా?.. తమకు తెలియదే… అలాంటప్పుడు పరిహారం ఎలా ఇస్తాం? అని సదరు ఎంపీని ప్రశ్నించారు.కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వద్ద రైతులకు మరణాలపై ఎలాంటి రికార్డులు లేవని అందువల్ల మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడమనే ప్రశ్న తలెత్తదని పేర్కొన్నారు. అంతేకాదు ఏ ఒక్క కుటుంబానికి పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలను ఆందోళనలను పలుమార్లు కోరామని గుర్తుచేశారు. వ్యవసాయ చట్టాలపై 11 సార్లు చర్చలు కూడా జరిపామని తెలిపారు. తోమర్ వ్యాఖ్యలు రైతాంగ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. రైతు ఉద్యమాన్ని కించపరిచేలా సమాధానం ఇచ్చారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు చనిపోయారని రైతు సంఘాలు విపక్షాలు చెబుతున్నాయి. పంజాబ్ హర్యానా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కువ మంది రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. రైతాంగ ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. రైతుల సహాయార్థం కోసం రూ.22.5 కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. చనిపోయిన రైతుల వివరాలివ్వాలని ఇప్పటికే రైతు సంఘాల నాయకులను కోరినట్లు తెలుస్తోంది.

మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం కూడా సభను ప్రతిపక్షాల సభ్యులు స్తంభింపజేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని సాగు చట్టాలు లఖీంపూర్ ఖీరీ ఘటనపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో పట్టబట్టాయి. వెల్‌లోకి దూసుకొచ్చి బ్యానర్లు ప్ల కార్డులతో నిరసనకు దిగారు. వాటినిపట్టించుకోకుండా ఎటువంటి చర్చా లేకుండా ప్రభుత్వం సాగు చట్టాలను కేవలం నాలుగు నిమిషాల్లో ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.