Begin typing your search above and press return to search.

మంత్రికి క్వారంటైన్ వర్తించదట.. సదానంద బుక్కైపోయారే

By:  Tupaki Desk   |   26 May 2020 3:00 AM GMT
మంత్రికి క్వారంటైన్ వర్తించదట.. సదానంద బుక్కైపోయారే
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ నిజంగానే అడ్డంగా బుక్కైపోయారని చెప్పక తప్పదు. ఎందుకంటే... ప్రభుత్వం రూపొందించిన ఆంక్షలు మంత్రిగా ఉన్న తనకు వర్తించవని, ఆ ఆంక్షలన్నీ కేవలం ప్రజలకేనని మాట తూలిన సదానందపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్ల మీద సెటైర్ల పడిపోతున్నాయి. అయినా అటు కేంద్ర మంత్రిమండలి అయినా, ఇటు రాష్ట్రాల మంత్రి మండళ్లైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే... ఆ నిర్ణయం ప్రజలతో పాటు నిర్ణయం తీసుకున్న మంత్రి మండలిలోని మంత్రులకు కూడా వర్తిస్తుంది కదా. మరి సదానంద తనకు ఆంక్షలు వర్తించవని చెబుతుంటే... ఆయన అడ్డంగా బుక్కైనట్టేగా.

సరే.. ఇక అసలు విషయానికి వస్తే... కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సోమవారం దాకా ఢిల్లీలోనే ఉండిపోయిన సదానంద... సోమవారం ఢిల్లీ నుంచి బెంగళూరు వచ్చిన ఫ్లైట్ లో బెంగళూరులో ల్యాండయ్యారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్ సెంటర్లలో ఉండాలని కర్ణాటకలోని బీఎస్ యడియూరప్ప సర్కారు ఓ తీర్మానం చేసింది కదా. ఆ తీర్మానం ప్రకారం.. ఢిల్లీ నుంచి బచ్చి సదానంద నేరుగా క్వారంటైన్ కు తరలిపోవాలి. అయితే అందుకు విరుద్ధంగా బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండై, ఎయిర్ పోర్టు బయటకు వచ్చిన సదానంద కారెక్కేసి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయారు. అంటే.. యడ్డీ సర్కారు తీర్మానానికి సదానంద తూట్లు పొడిచినట్టే కదా. మంత్రిగా ఉండి కూడా కర్ణాటక కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే కదా.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా... అసలు క్వారంటైన్ కు కాకుండా ఇంటికి ఎలా వస్తారన్న ప్రశ్నలకు సదానంద ఇచ్చిన సమాధానాలు ఆయనను అడ్డంగా బుక్ చేసిపారేశాయి. అయితే సదానంద గౌడ ఏమన్నారంటే... ‘‘కేంద్ర మంత్రిగా క్వారంటైన్ నుంచి నాకు మినహాయింపు ఉంది. అంతేకాకుండా కేంద్రం సూచించిన ఆరోగ్య సేతు యాప్ ఉంది. ఆ యాప్ స్టేటస్ కూడా గ్రీన్ కలర్ లో ఉంది. దీంతో నాకు క్వారంటైన్ వర్తించదు. కరోనా పోరులో ముందువరుసలో సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచితే దాని ఎలా పారదోలుతాం. ఫెర్టిలైజర్స్ మంత్రిగా దేశవ్యాప్తంగా సరిపడ ఔషధాలు ఉన్నాయా? లేవా? అని చూడటం నా విధి. అలాంటప్పుడు నన్ను క్వారంటైన్ లో ఉంచడం సరికాదు’’ అని సదానంద చెప్పుకొచ్చారు. ఇన్నేసి ఈక్వేషన్ లు చెప్పిన సదానంద పై నెటిజన్లు ఓ రేంజిలో సెటైర్లు సంధిస్తున్నారు.