Begin typing your search above and press return to search.

కశ్మీరీలకు కాలేలా కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   23 Sep 2019 6:56 AM GMT
కశ్మీరీలకు కాలేలా కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
X
ఉత్సాహం మంచిదే. మితిమీరితేనే కష్టం. తాజాగా కశ్మీరీ అంశంపై కమలనాథులు చేసిన వ్యాఖ్యలతో కశ్మీరీలు రగిలిపోతున్నారు. ఆర్టికల్ 370 నిర్వీర్యం తదనంతర పరిణామాల నేపథ్యంలో అందమైన కశ్మీరీ అమ్మాయిలు ఎవరినైనా పెళ్లాడొచ్చన్న మాట.. కశ్మీరీల మనసుల్ని ఎంతగా గాయపరిచిందో.. స్థానిక కశ్మీరీలతో మాట్లాడితే ఇట్టే అర్థమవుతుంది. కశ్మీరీ లాంటి సున్నిత అంశాల విషయంలో తొందరపాటు ఏ మాత్రం మంచిది కాదు. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తూ సాహసోపేత నిర్ణయాల్ని తీసుకుంటున్న మోడీ స్ఫూర్తికి భిన్నంగా బీజేపీ నేతలు పలువురు బలుపు వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారుతోంది.

ఆర్టికల్ 370 నిర్వీర్యం.. తదనంతరం కశ్మీరీ వ్యాలీలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు.. అక్కడి రాజకీయ నేతల్ని హౌస్ అరెస్ట్ చేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల్ని జాగ్రత్తగా డీల్ చేస్తున్న మోడీ అండ్ కోకు ఇబ్బంది కలిగించేలా తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీషాలకు ఇబ్బంది కలిగేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కశ్మీరీలకు ఎక్కడో కాలేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు.

జమ్ముకశ్మీర్ నాయకుల్ని అరెస్ట్ చేయలేదని.. వారిని 18 నెలలకు పైనే హౌస్ గెస్టులుగా ఉంచనున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ నేతల్ని వీఐపీ బంగళాల్లో ఉంచామని.. వారికి హాలీవుడ్ సినిమాల సీడీలు కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీరీ నేతల్ని అరెస్ట్ చేయలేదని.. లగ్జరీ హౌస్ లలో వారిని అతిధులుగా ఉంచినట్లుగా పేర్కొన్నారు.

కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ.. అందుకు కీలకమైన ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు చట్టాన్ని చేయటం తెలిసిందే. అనంతరం కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా.. కశ్మీరీ రాజకీయ నేతల్ని హౌస్ అరెస్ట్ తరహాలో వీవీఐపీ బంగ్లాలలో వారిని ఉంచారు.

ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా.. ముఫ్తీ.. ఒమర్ అబ్దుల్లాలు ప్రస్తుతం నిర్భందాన్ని ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల రాజ్యసభ సభ్యులు కమ్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రత చట్టం కింద అదుపులోకి తీసుకొని వీఐపీ బంగ్లాలో ఆయన్ను ఉంచారు. జమ్ముకశ్మీర్ నేతలకు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా వారిని వేర్వేరు ప్రాంతాల్లోని బంగ్లాలలో ఉంచారు.

ఇలాంటివేళ.. అత్యుత్సాహంతో కశ్మీరీ నేతల్ని 18 నెలలకు మించి హౌస్ గెస్టులుగా ఉంచుతామంటూ కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వ్యాఖ్యలు చేయటంపై కలకలం రేగింది. మరి.. దీనికి మోడీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.