Begin typing your search above and press return to search.

అన్ని మాట్లాడిన అమిత్ షా.. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాల్సింది?

By:  Tupaki Desk   |   15 May 2022 2:30 PM GMT
అన్ని మాట్లాడిన అమిత్ షా.. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాల్సింది?
X
అది చేశాం.. ఇది చేశాం.. అంటూ పెద్ద లిస్టు చదివిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలు విన్న తర్వాత.. అయ్యో కేంద్ర ప్రభుత్వం ఇన్ని చేసిన తర్వాత కూడా తెలంగాణకు ఏమీ చేయలేదంటూ కేసీఆర్.. ఆయన కుమారుడు.. కుమార్తె.. మేనల్లుడు వరుస పెట్టి తిట్టి పోస్తున్నారే అన్న విస్మయం వ్యక్తం చేయొచ్చు. నిజానికి నేతల తెలివే వేరు. ప్రజల్ని ఎప్పుడు.. ఎలాంటి మాటలు చెబితే వారి మనసుల్ని మార్చొచ్చన్న విషయంలో వారికి ఉన్న టాలెంట్ ఎంతన్నది అమిత్ షా మాటల్ని చూస్తే అర్థమవుతుంది.

ఉదాహరణకు పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం గురించి వస్తే.. బియ్యం ఇచ్చేది తామైతే.. కేసీఆర్ తామిచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటారన్న మాటతో పాటు.. ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ఇళ్లను ఇస్తే.. దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుమారుడు బొమ్మలు వేసుకొని తామిచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. అంతే కాదు.. మోదీ సమగ్ర శిక్షా అభియాన్‌ పథకాన్ని తెస్తే.. ఆ పథకాన్ని, కేంద్రం నిధులను తీసుకొని ‘మన ఊరు-మన బడి’ పేరుతో అమలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చాలానే చేసిందన్న భావనను కలిగేలా చేయటంలో అమిత్ షా సక్సెస్ అయ్యారు. కాకుంటే.. ఇక్కడ అందరిని అమిత్ షా తప్పు పట్టించే విషయం ఏమంటే.. తెలంగాణకు ఇస్తున్నట్లుగా చెబుతున్న అన్ని పథకాలు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు అమలు చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. కేంద్రం తన వంతుగా అన్ని రాష్ట్రాలకు కొన్ని పథకాల్ని అమలు చేస్తూ ఉంటుంది. వాటిని మినహాయించుకొని తెలంగాణకు మాత్రమే ఏం చేశారు? అన్న ప్రశ్న వేసుకుంటే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది.

ఉదాహరణకు అప్పుడెప్పుడో యూపీఏ జమానాలో ఉమ్మడి రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టును ఇస్తున్నట్లుగా చెప్పారు. కాలచక్రంలో ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయే తప్పించి.. దానికి సంబంధించింది తెలంగాణకు ఇప్పటివరకు వచ్చింది లేదు. అంతేనా.. వరంగల్ కు ఇవ్వాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి తరలి వెళ్లిపోయిన విషయం కానీ.. యూపీఏ హయాంలో ఇచ్చిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీని కూడా నెరవేర్చలేదన్నది మర్చిపోకూడదు. ఇవన్నీ ఒక ఎత్తు.. 2019 సార్వత్రిక ఎన్నికల వేళలో.. తనను ఎంపీగా గెలిపిస్తే.. నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పిన ధర్మపురి అర్వింద్.. అందుకు తగ్గట్లు బాండ్ పేపర్ల మీద రాసివ్వటం తెలిసిందే.

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి.. దానికి బదులు సుగంధ ద్రవ్యాల బోర్డు పెట్టినట్లుగా పేర్కొన్నారే తప్పించి.. దానికి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పసుపు రైతులకు మోడీ సర్కారు హ్యాండ్ ఇచ్చిన తీరును తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు కదా? ఇక.. విభజన వేళలో ఇచ్చిన ట్రైబల్ వర్సిటీతో పాటు.. ఐఐటీ.. ఐఐఎంతో పాటు మెడికిల్ కాలేజీల విషయంలో తెలంగాణకు దక్కిందేమీ లేదన్నది మర్చిపోకూడదు. వీటి గురించి ప్రస్తావించకుండా తెలివిగా.. వాటి ప్రస్తావనే తీసుకురాని తీరు చూస్తే.. ముచ్చట పడాల్సిందే. తెలంగాణకు అన్నిచేశాం.. ఇన్ని చేశామని చెప్పే అమిత్ షా.. ఇప్పుడు అడిగిన వాటిల్లో ఏ ఒక్క దానికి సమాధానం చెప్పినా బాగుంటుంది. కానీ.. అంత సాహసం చేసే సత్తా ఎవరికి ఉంది చెప్పండి?