Begin typing your search above and press return to search.

తెలంగాణాకు అమిత్ షా ఎందుకొచ్చినట్లు ?

By:  Tupaki Desk   |   15 May 2022 9:30 AM GMT
తెలంగాణాకు అమిత్ షా ఎందుకొచ్చినట్లు ?
X
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపేందుకే అయితే తాను హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేదని, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఒక్కడే చాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అంటే బండి మీద కేంద్రమంత్రికి ఎంతటి నమ్మకం ఉందో దీంతోనే అర్ధమైపోతోంది. మరి అదే నిజమైతే అమిత్ షా తెలంగాణాకు ఎందుకొచ్చినట్లు ? ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో కార్యక్రమం చూసుకుని తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయుండచ్చు కదా. రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నట్లు ?

తన ప్రసంగాన్ని ఒకే ఒక అజెండాగా సెట్ చేసుకున్నారు. అదేమిటంటే కేసీయార్+ఆయన పిల్లలపై అవినీతి ఆరోపణలు చేయటం, విమర్శలు ఎక్కుపెట్టడం. నిజంగానే కేసీయార్ అవినీతిపై తమ దగ్గర ఆధారాలుంటే ఎందుకని విచారణ చేయించటం లేదు ? విచారణకు ఆదేశించటం, దర్యాప్తు మొదలు పెట్టించటం మానేసి ఊరికే పదే పదే కేసీఆర్ అవినీతిపై ఆరోపణలు చేయటం వల్ల ఎలా ఉపయోగం ఉండదని తెలియదా ?

అయినా కేసీయార్ ను గద్దె దించడం సంగతి పక్కన పెట్టేస్తే అసలు కమలం పార్టీ బలం ఏమిటో అమిత్ షా కు తెలుసా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారమే 119 నియోజకవర్గాల్లో కనీసం 80 నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి అభ్యర్థులు లేరు. తెలంగాణాలోని కేసీయార్ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకి పడే అవకాశాలు లేవు. ఎందుకంటే అధికారం కోసం బీజేపీ, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా పోరాటం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో తెలీదు కానీ కనీసం 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులైతే ఉంటారు.

అసలు అన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను కూడా పెట్టుకోలేని అమిత్ షా చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడారు. పార్టీలో గట్టి అభ్యర్ధులు లేరు కాబట్టే ఇతర పార్టీల్లోని నేతలకు గాలమేస్తున్నారు. ఇపుడు బీజేపీలో ఉన్న గట్టి అభ్యర్ధుల్లో కూడా సగానికి పైగా కాంగ్రెస్ నుండి వచ్చిన నేతలే. బహుశా టీఆర్ఎస్+కాంగ్రెస్ లో టికెట్లు దక్కని నేతల పైన బీజేపీ ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది. ఏదేమైనా అమిత్ షా కు గుడ్ లక్ చెబుదాం.