Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ కారు స్టీరింగ్‌... ఎంఐఎం చేతిలో ఉంది!

By:  Tupaki Desk   |   15 May 2022 5:12 AM GMT
టీఆర్ ఎస్‌ కారు స్టీరింగ్‌... ఎంఐఎం చేతిలో ఉంది!
X
తుక్కుగూడ‌లో బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ నెంబ‌ర్ 2 నాయ‌కుడు.. అమిత్ షా ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేసీఆర్‌పైనా, అధికార పార్టీ టీఆర్ ఎస్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. టీఆర్ ఎస్ స్టీరింగ్‌.. అస‌దుద్దీన్ ఓవైసీ చేతిలో ఉంద‌ని.. వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ 45 డిగ్రీల ఎండలో 660 కి.మీ. నడిచారని తెలిపారు.

కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా మీ వెంట మేముంటామ‌ని అమిత్ షా భ‌రోసా క‌ల్పించారు. అసెంబ్లీలో ఒక్క సీటు గెలిచిన పార్టీ బల్దియా ఎన్నికల్లో 40కి పైగా సీట్లు గెలిచారని పేర్కొన్నారు. కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుంద‌ని హామీ ఇచ్చారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదని కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేసీఆర్ రెండు పడకగదుల ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని అమిత్ షా నిల‌దీశారు. ప్రధాని ఆవాస్‌ యోజనను రాష్ట్రంలో అమలు చేయట్లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నగరంలో 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని మోసం చేస్తున్నారన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుప‌త్రుల‌ను పట్టించుకోని సీఎం కొత్తగా నిర్మిస్తారా? అని నిల‌దీశారు.

ఇంత అవినీతి ప్రభుత్వాన్ని త‌న‌ జీవితంలో చూడలేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ అవినీతి సర్కార్‌ను గద్దె దించేందుకు యువత కదలిరావాల‌న్నారు. కేంద్రం నిధులిచ్చే పథకాలనే కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. సమగ్ర శిక్ష అభియాన్‌ కింద నిధులిస్తే.. మనబడి- మనఊరు అంటున్నారని ఎద్ద‌వా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ హత్యా రాజకీయాలు మొదలుపెట్టారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ను పొట్టనపెట్టుకున్నారని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ధాన్యం కొనట్లేదని కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న అమిత్ షా.. ఎంఐఎం,టీఆర్ ఎస్ పార్టీలు అవిభక్త కవలలని పేర్కొన్నారు. టీఆర్ ఎస్‌ కారు స్టీరింగ్‌... ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదని నిల‌దీశారు.

నిజాం ప్రభువును గద్దె దించేందుకే సంజయ్ యాత్ర

బండి సంజయ్‌ యాత్ర పదవుల కోసం కాదని అమిత్ షా తెలిపారు. నిజాం ప్రభువును గద్దె దించేందుకే సంజయ్ యాత్ర చేప‌ట్టార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రజాకార్‌ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే ఈ యాత్ర చేసిన‌ట్టు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసమే సంజయ్‌ యాత్ర చేస్తున్నార‌ని తెలిపారు. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచనదినాన్ని ఈ ప్రభుత్వం జరపలేదని నిప్పులు చెరిగారు.