Begin typing your search above and press return to search.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో అనూహ్య ట్విస్ట్

By:  Tupaki Desk   |   5 July 2022 4:31 PM GMT
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో అనూహ్య ట్విస్ట్
X
కులం.. కులం.. నీదే కులం.. ఎక్కడికెళ్లినా అదే మాట.. కులాన్ని బట్టి టాలెంట్ లేకున్నా పోస్టింగులు ఇచ్చే వారు రాష్ట్రంలో , దేశంలో ఎంతో మంది ఉన్నారు.. కులాన్ని బట్టి ప్రేమికులను విడదీస్తారు.. పరువు హత్యలు కూడా చేస్తారు. కులం కుంపట్లలో ఎంతో మందికి కడుపుకోతలు, గుండెకోతులు మిగిలాయి..

తమ కూతురిని లేపుకొని వెళ్లి పెళ్లి చేసుకున్న అల్లుల్ల అంతు చూస్తున్నారు మామలు.. ఇప్పటికే నల్గొండలో ‘ప్రణయ్’ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 20 ఏళ్ల పాటు తల్లిదండ్రులు పెంచి పెద్దచేస్తే ఆ కూతుళ్లు చాలా వరకు వయసు వచ్చాక నచ్చిన తోడు వెతుక్కుంటున్నారు. ఇందులో 80 శాతం పెళ్లి వరకు వెళ్లడం లేదు. 20 శాతం ప్రేమ జంటలు పెళ్లితో ఏకమవుతున్నాయి.

ఇందులో కొంతమంది తండ్రులు ప్రేమ పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుళ్లను మాయమాటలతో పెళ్లి చేసుకున్నారని అల్లుళ్లపై పగను పెంచుకుంటున్నారు.. కులాంతర వివాహం తమ పరువు తీసిందని ఇంకొందరు భావిస్తున్నారు.. ముక్కుమొఖం తెలియని వాడికి తన ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మరికొంతమంది ఆలోచిస్తున్నారు.

ఈ పరువు హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు ఈ హత్యను పరువు హత్యగా తేల్చారు. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్న నారాయణరెడ్డిని మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఢిల్లీలో ఉన్న కుమార్తె, ఆమె వివాహం చేసుకున్న అల్లుడు నారాయణ రెడ్డి ఘనంగా పెళ్లి చేస్తానంటూ ఇంటికి పిలిపించాడు మామ వెంకటేశ్వర్ రెడ్డి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్టు విచారణలో వెల్లడైంది. ఇంటికి రాగానే కుమార్తెను గృహ నిర్బంధం చేసిన వెంకటేశ్వర్ రెడ్డి వేరే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డిని హత్య చేయాలని యువతి తండ్రి భావించాడు. శ్రీనివాస్ రెడ్డి, ఆశిక్, కాశీలకు ఐదు లక్షల సుపారీ ఇచ్చాడు.

వారు జూన్ 27న కేపీహెచ్.బీ రూమ్ నుంచి నారాయణరెడ్డిని కారులో ఎక్కించుకొని మద్యంలో మత్తు మందు కలిపి టవల్ తో మెడకు ఉచ్చు బిగించి హతమార్చారు. అనంతరం జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి ఆ మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చివేశారు. కాల్ డేటా ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. మామ వెంకటేశ్వర్ రెడ్డినే చేయించిన పరువు హత్యగా తేలింది. మరో ప్రాణం పోయింది. మృతుడు నారాయణరెడ్డిది ప్రకాశం జిల్లా పొదలకుంట్లపల్లి.