జగన్ సర్కార్ ని హడలెత్తిస్తున్న ఒకే ఒక్కడు... ?

Sun Nov 28 2021 08:33:23 GMT+0530 (IST)

Undavalli Arun Kumar  Comment On Ap Government

ఆయన రాజకీయంగా సామాజికపరంగా ఆర్ధికంగా పెద్దగా బలవంతుడు కాదు. ఆయన అతి సామాన్యుడు. ఏదో వైఎస్సార్ దయతో రెండు సార్లు ఎంపీగా అయ్యారు. తనకు అదే పదివేలు ఇక చాలు అనుకున్నారు. సరే ఆయన ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు కానీ రాజకీయ విశ్లేషకుడిగా విమర్శకుడిగా ఎన్నడూ రిటైర్ కాలేదు. అదే ఇపుడు వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఆయన వేసే గుగ్లీస్ తో ప్రభుత్వమే ఒక్క లెక్కన విలవిలలాడుతోంది. ఆయన నెలకు ఒక మారు మీడియా ఎదుటకు వచ్చివైసీపీ సర్కార్ గురించి చెబుతున్న చేదు నిజాలు జనాల్లోకి యమ జోరుగా వెళ్ళిపోతున్నాయి.దాన్ని కనీసం కౌంటర్ చేసేందుకు కూడా వైసీపీ పెద్దలు జంకే సీన్ ఉంది. ఎందుకంటే ఉండవల్లి మాటల చతురుడు లాజిక్ తెలిసిన వాడు. బాగా మాటకారి అన్నింటికీ మించి ఏదీ ఆధారాలు లేకుండా ఒక్క ముక్క అసలు మాట్లాడరు. దాంతో ఆయనను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వ పెద్దలు తల్లడిల్లుతున్నారు. ఆ మాటకు వస్తే ఎంతో మంది ఉద్ధండులు బలవంతులతో కూడా జగన్ సర్కార్ పోరాడింది. వారిని సైడ్ చేస్తూ వచ్చింది. కానీ ఉండవల్లితో వ్యవహారం అలా కాదు ఆయనకు ఏ అపేక్షా లేదు ఏ అకాంక్ష అసలు లేవు. ఆయన ప్రజల తరఫున ఒక బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నారు.

తన అభిప్రాయాలను కుండబద్ధలు కొడుతున్నారు. ఆయన తన మిత్రుడి కుమారుడే సీఎం అని ఎక్కడా పక్షపాతం అసలు చూపించడంలేదు. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతున్నారు. నాడు చంద్రబాబు ఏలుబడిలో ఎలా చీల్చిచెండాడారో ఇపుడు కూడా అలాగే చేస్తున్నారు. అయితే ఇది వైసీపీ పెద్దలకు ఇబ్బందిగా మారుతోంది. ఎలా ఉంది అంటే మహా భారతంలో భీష్ముడు యుద్ధ రంగాన నిలిచి తన శరపరంపరంతో పాండవ సైన్యాన్ని తుత్తునియలు చేస్తూంటే ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్న పరిస్థితి. ఇక్కడ భీష్ముడు ఉండవల్లి అని పాండవులు వైసీపీ వారు అని చెప్పడం కాదు కానీ అనేక రకాలుగా ఆరితేరిన ఉండవల్లి ముందు ఏ ఒక్క వైసీపీ నేత నిలిచి బదులిచ్చే సీన్ లేదని చెప్పేందుకే ఈ పోలిక.

జగన్ ని అట్టర్ ఫ్లాప్ పాలన అని ఉండవల్లి గారే సర్టిఫికేట్ ఇచ్చేశాక ఇక అంతకంటే ప్రభుత్వానికి చిన్న చూపు వేరే ఉంటుందా అన్నది కూడా లాజిక్ పాయింట్. ఎక్కడైనా ఎపుడైనా అస్మదీయులు మెచ్చుతారు. తస్మదీయులు తలంటుతారు. అయితే ఉండవల్లి మాకు అస్మదీయుడు కాడని వైసీపీ నేతలు చెప్పుకున్నా ఆయన తస్మదీయుడు మాత్రం కారు అన్నది లోకానికి తెలుసు. ఆ విధంగా చూస్తే ఆయన వైసీపీ రెండున్నరేళ్ల పాలన గురించి చెప్పిన తీర్పు కచ్చితంగా ప్రమాదకరమే అనుకోవాలి. ఒక విధంగా జగన్ సర్కార్ ని కడిగి పారేస్తున్నారు. ఇలాగేనా పాలన చేసేది అంటూ దుమ్ము దులిపేస్తున్నారు. మీ మానాన మీరు అప్పులు చేసి రాష్ట్రాన్ని జనాల భవిష్యత్తుని రోడ్డున పారేసి పోతే దిక్కెవరు అంటూ ఆయన గర్జిస్తున్న తీరు సగటు మనిషి గొంతుకనే వినిపిస్తోంది.

ఒక విధంగా విపక్ష తెలుగుదేశం ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పినా జనాలు రాజకీయం అనుకుంటారు. కానీ ఏ పార్టీకి చెందని ఉండవల్లి వైఎస్సార్ కి అతి సన్నిహితుడు అయిన ఉండవల్లి ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే కచ్చితంగా అది జనాల్లోకి సులువుగా పోతుంది. తటస్థ వాదుల నుంచి వైఎస్సార్ అభిమానుల దాకా అందరికీ ఎక్కుతుంది. ఇపుడు అదే జరుగుతోంది. ఉండవల్లి అంతకంతకు తన మాటల దాడి పెంచుతున్నారు. విమర్శల తీవ్రతను పెంచుతున్నారు. ఆయన్ని కనీసం కౌంటర్ చేయడానికి కూడా వైసీపీ ఆలోచిస్తోంది అంటే జనాలకు తాము అన్ని తప్పులూ ఒప్ప్పుకున్నామని చెప్పినట్లే కదా అంటున్నారు. సో ఉండవల్లి ఇపుడు ఒకే ఒక్కడుగా వైసీపీ సర్కార్ ని గడగడలాడిస్తున్నాడు. మరి ఆయన ఇదే తీరున వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకతను పెంచితే మాత్రం రేపటి ఎన్నికల ఫలితాల గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తూ వైసీపీ పెద్దలు నిద్ర లేని రాత్రులు గడపాల్సిందేనేమో.