Begin typing your search above and press return to search.

మృతులకు సంబంధించి మారని లెక్కలు..జులై 28 నుండి అవే లెక్కలు!

By:  Tupaki Desk   |   11 Aug 2020 12:30 AM GMT
మృతులకు సంబంధించి మారని లెక్కలు..జులై 28 నుండి అవే లెక్కలు!
X
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న రోజువారీ బులెటిన్‌లో కేసులు, మరణాలు, టెస్టుల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల సంఖ్య వివరాలను కూడా ఏ రోజుకారోజు మార్చి ఇస్తున్నారు. కానీ లింగం, వయసుల వారీగా కేసుల శాతం, మరణాల రేటు విషయంలో మాత్రం గత రెండు వారాలుగా ఏ మార్పూ ఉండటం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 28 నుంచి మీడియా బులెటిన్‌ లో వైద్య ఆరోగ్యశాఖ మార్పులు చేసి ఎక్కువ పేజీల్లో వివరాలను ఇస్తున్న సంగతి తెలిసిందే.

జూలై 27 నాటికి నమోదైన మొత్తం కేసులు, మరణాల ఆధారంగా.. ఏ వయసువారిలో ఎన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి, ఎంత మంది మరణించారనే లెక్కని జూలై 28 నాటి బులెటిన్‌ లో వెల్లడించారు. ఆ గణాంకాలనే నేటికీ ఇస్తున్నారు. ఉదాహరణకు, జూలై 27 నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 57,142. అప్పటికి వయసులవారీగా పురుషుల్లో 65.6%, మహిళల్లో 34.4% మంది వైరస్‌ బారిన పడినట్లు జూలై 28 నాటి బులెటిన్‌ లో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 79,495కు చేరింది. కానీ వయసుల వారీగా స్త్రీ, పురుషుల్లో వైరస్‌ బారిన పడినవారి శాతాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి.

అలాగే జూలై 27 నాటికి మరణాల సంఖ్య 480 ఉండగా, శనివారం రాత్రికి ఆ సంఖ్య 627కు చేరింది. జూలై 28 నాటి బులెటిన్‌ లో కరోనా మరణాల రేటు 46.13 శాతంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఆగస్టు 9 న విడుదల చేసిన బులెటిన్ ‌లో కూడా అవే గణాంకాలను వెల్లడించింది. ఇలా 14 రోజులుగా అవే గణాంకాలు పునరావృతమవుతుండడం గమనార్హం. కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 80 వేలకు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,256 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,587 మంది కోలుకోగా, 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఆసుపత్రుల్లో 22,528 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 57,586 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 637కు చేరింది.