ఉక్రెయిన్ ఘోరాలు: అపార్ట్ మెంట్ లో 200 కుళ్లిపోయిన మృతదేహాలు

Thu May 26 2022 07:00:02 GMT+0530 (IST)

Ukraine atrocities: 200 decomposing bodies in the apartment

యుద్ధం మిగిల్చే విషాదం ఊహకు అందనిదిగా ఉంటుంది.  ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం ఇప్పుడు నెలలు గడుస్తున్నా ముగియడం లేదు. ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం ప్రారంభం సమయంలో కేవలం ఉక్రెయిన్ సైన్యం మీదేనే దాడి చేసిన రష్యా.. ఇప్పుడు సామాన్య జనాలపై నగరాలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించి అందరినీ చంపేస్తోంది. ఈ యుద్ధం వల్ల అమాయక ఉక్రెయిన్ ప్రజలు అసువులు బాస్తున్నారు.రష్యా నివాసాలపై బాంబు దాడులు చేస్తూ చెలరేగుతోంది. ఇందులో భాగంగానే ఓ అపార్ట్ మెంట్ పై చేసిన దాడుల దాష్టీకం తాజాగా బయటపడింది. ఇది ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. భీకర పోరాటం తర్వాత ఇటీవల మరియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణ మారణకాండ వెలుగుచూసింది.

మారియుపోల్ లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఏకంగా 200 మృతదేహాలు బయటపడడం సంచలనమైంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు మంగళవారం వెల్లడించారు.

మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని.. తీవ్రమైన దుర్వాసన వస్తున్నాయని మేయర్ వాపోయారు. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మారియుపోల్ లోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఆ పార్ట్ మెంట్ సెల్లార్ నుంచి తీవ్రమైన దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు షాక్ అయ్యారు. దాదాపు 200 వరకూ మృతదేహాలు కుళ్లిన స్థితిలో అక్కడ కనిపించాయి.

రష్యా దాడుల్లో మారియుపోల్ నగరంలో దాదాపు 21 వేల మంది మృతిచెందినట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్త పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.

ఇప్పటికీ రష్యా ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. సీవియోరోదొనెట్స్క్ దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా దిగ్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలు మోహరించాయి. స్విట్లోడార్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొని తమ జెండాను ఎగురవేశాయి. ఇప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా 1474  క్షిపణలు ప్రయోగించింది. వినాశనం సృష్టించింది.