Begin typing your search above and press return to search.

పంటలు నాశనం చేసిన మిడతలని ఫ్రై చేసుకొని తింటున్న యుగాండా ప్రజలు !

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:30 PM GMT
పంటలు నాశనం చేసిన మిడతలని ఫ్రై చేసుకొని తింటున్న యుగాండా ప్రజలు !
X
గత కొన్నిరోజులుగా ప్రపంచంలోని కొన్ని దేశాలు మిడతల భారిన పడి , వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక అనేక ఇబ్బందులని ఎదుర్కొంటున్నాయి. చేతికి వచ్చిన పంటల్ని ఈ మిడతల దండు క్షణాల వ్యవధిలో నాశనం చేస్తున్నాయి. మిడతల దండును ఎలా కంట్రోల్ చేయాలో పాలుపోక అయోమయం లో పడింది, మిడతల భాదిత దేశాలు. ఇక ఈ మిడతల దాడి తో యుగాండా లో పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో యుగాండా ప్రజలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

అదేమిటి అంటే ..తమ పంటలని నాశనం చేసిన ఎడారి మిడతలని స్థానికులు ఆహారంగా తీసుకొంటున్నారు.
కిట్గుమ్ జిల్లాలో ఈ పరిస్థితి ఏర్పడిందని యుగాండా రేడియో నెట్‌ వర్క్ వార్తా సంస్థ తెలిపింది. అయితే , మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళన కూడా వ్యక్తమవుతోంది. మిడతలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకొనేందుకు మిడతల బాధిత ప్రాంతాల్లో యుగాండా ప్రభుత్వం రసాయనిక మందులు పిచికారీ చేయిస్తోంది. దీనివల్ల మిడతలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఆందోళన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.


మిడతలను పట్టుకొని, నీటిలో ఉడికించి, ఎండబెట్టి తర్వాత వాటిని వేయించుకొని తింటున్నామని స్థానికులు చెప్పారు. మిడతలను స్థానికులు వంటకు సిద్ధం చేస్తున్న ఫొటోలను ది అబ్జర్వర్ పత్రిక పబ్లిష్ చేసింది.
మిడతలను తినొచ్చని పెద్దవారు చెప్పారని, రుచి చూసేందుకు వాటిని పట్టుకోవాలనుకొంటున్నానని గోగో గ్రామానికి చెందిన క్రిస్టీన్ అబాలో అనే మహిళ యూఆర్‌ ఎన్‌ తో చెప్పారు. మిడతల నియంత్రణ విధుల్లో పాలుపంచుకొంటున్న కిట్గుమ్ జిల్లా స్థాయి అధికారి జాన్ బోస్కో కోమకెచ్ యూఆర్‌ఎన్‌తో మాట్లాడుతూ- ఎడారి మిడతలు తినడం హానికరం కాదని, స్థానికులు పట్టుకొన్న మిడతలపై ఇంకా మందు పిచికారీ చేయలేదని తెలిపారు.

ఇకపోతే , మిడతల దాడులతో సొమాలియా ప్రభుత్వం ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎర్ర సముద్రం మీదుగా యెమెన్ నుంచి ఈ కీటకాలు తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించాయి. 2019 చివర్లో వానలు భారీగా కురవడంతో కీటకాలు వృద్ధి చెందడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్క రోజులో మిడతలు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. రోజులో ఒక మిడత తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలదు.