Begin typing your search above and press return to search.

10 నిమిషాల్లో అర్నబ్ అసెంబ్లీకి రావాలి

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:40 PM GMT
10 నిమిషాల్లో  అర్నబ్ అసెంబ్లీకి రావాలి
X
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి, మహారాష్ట్ర సర్కార్ కు మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. సుశాంత్ వ్యవహారంలో ఉద్ధవ్ సర్కార్ ను డ్యామేజ్ చేస్తూ కథనాలు ప్రసారం చేశారని శివసేన నేతలు అర్నబ్ పై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అసెంబ్లీలో అర్నబ్ కు వ్యతిరేకంగా ప్రత్యేక హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశ పెట్టి మరీ చర్చ జరిపారు. ఆర్నబ్ కు వ్యతిరేకంగా శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయిక్ కొద్ది రోజుల క్రితం ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ప్రముఖుల ప్రతిష్ఠను మంటగలపాలన్న ప్రయత్నం చేస్తున్నారని.. అతడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శివసేన నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే అర్నబ్ ను అసెంబ్లీకి రావాలని మూడు సార్లు నోటీసులు మహారాష్ట్ర ప్రభుత్వం పంపింది.

తాజాగా, నాలుగో సారి నోటీసు పంపిన ఉద్ధవ్ సర్కార్....నోటీసు పంపిన 10 నిమిషాల్లో అర్నబ్ అసెంబ్లీకి రావాలని ఆదేశించింది. ఇప్పటికే మూడు నోటీసులు పంపామని, అయినా అర్నబ్ స్పందించకపోవడం అసెంబ్లీ ధిక్కారమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నోటీసులపై అర్నబ్ మండిపడ్డారు. 10 నిమిషాల్లో హాజరు కావాలని నోటీసులు పంపడం ఏమిటని అర్నబ్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే తనకు నోటీసులుపంపారని ఆరోపించారు. ఈ నోటీసుల విషయంపై తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని, ఆ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని అన్నారు. సభలోని వ్యక్తులు కానివారికి సభా హక్కుల ఉల్లంఘన వర్తించదని చెప్పారు. తాను నోటీసులకు ఇచ్చిన సమాధానాలను మహారాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని అన్నారు.