Begin typing your search above and press return to search.

ఉద‌యపూర్ నిందితుల‌కు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలున్నాయా?

By:  Tupaki Desk   |   29 Jun 2022 9:30 AM GMT
ఉద‌యపూర్ నిందితుల‌కు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో సంబంధాలున్నాయా?
X
బీజేపీ బ‌హిష్కృత నేత నుపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒక టైల‌ర్ ను ఇద్ద‌రు రాజ‌స్థాన్ లోని ఉద‌యపూర్ లో మెడ న‌రికి చంపిన సంగ‌తి తెలిసిందే. హ‌తుడు కన్హయ్య లాల్‌ను హంత‌కులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లు అతిదారుణంగా ప‌ట్ట‌ప‌గ‌లే అత‌డి టైల‌రింగ్ షాపులోనే న‌రికి చంప‌డం, పైగా దాన్ని వీడియో తీసుకోవ‌డం.. వైర‌ల్ చేయ‌డం క‌ల‌క‌లం రేపాయి.

పైగా హంత‌కులు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని సైతం చంపుతామ‌ని బెదిరించ‌డం తీవ్ర ఉద్రిక‌త్త‌ల‌కు దారితీసింది. ఉద‌య‌పూర్ లో క‌ర్ఫ్యూ, 144 సెక్ష‌న్ విధించారు. ఇంట‌ర్నెట్ పై నిషేధం కొన‌సాగుతోంది. అద‌న‌పు బ‌ల‌గాల ప‌హారాలో ప్ర‌స్తుతం ఉద‌య‌పూర్ న‌గ‌రం ఉంది. వ‌ర్త‌క‌, వ్యాపార‌, వాణిజ్య కేంద్రాలు, మార్కెట్లు అన్నీ మూత‌ప‌డ్డాయి.

పోలీసులు ఘ‌ట‌న జ‌రిగిన రోజే పారిపోతున్న హంత‌కులు ఇద్ద‌రిని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా హంత‌కుల‌కు సంబంధించి అనేక విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో హంత‌కులిద్ద‌రికి సంబంధాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు నేష‌న‌ల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ద‌ర్యాప్తులో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని తెలుస్తోంది.

టైల‌ర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లు రికార్డ్ చేసిన మూడో వీడియో తాజాగా వెలుగుచూసింది. మొద‌టి వీడియో టైల‌ర్ హ‌త్య‌ది కాగా, రెండో వీడియో.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని బెదిరిస్తూ తీసింది. ఇక మూడో వీడియోలో కన్హయ్య లాల్ మృతదేహం అతని దుకాణం వెలుపల పేవ్‌మెంట్‌పై పడి ఉంది. హంత‌కులిద్ద‌రూ ఖంజీపీర్‌లోని ఓ వెల్డింగ్‌ షాపులో పనిచేస్తున్నారు.

భిల్వారాకు చెందిన రియాజ్ ఉదయపూర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అలాగే గౌస్ మ‌హ్మ‌ద్ రాజస్థాన్ లోని భీమాకు చెందినవాడని పోలీసులు గుర్తించారు. వారి మూలాల ప్రకారం.. హంత‌కులు ఇద్దరూ పాకిస్తాన్‌లోని ఒక ముస్లిం ఛాందసవాద సంస్థ దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని అంటున్నారు.

కాగా మహ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన‌ మరో బీజేపీ నేత నవీన్ జిందాల్ ను కూడా నిందితులు చంపుతామ‌ని బెదిరించిన‌ట్టు తెలుస్తోంది. నీకు కూడా కన్హయ్య లాల్ లాంటి గతే ప‌డుతుంద‌ని బెదిరించార‌ని ఆయ‌న అంటున్నారు. ఈ మేర‌కు త‌న‌కు వ‌చ్చిన బెదిరింపు ఈమెయిల్‌ల స్క్రీన్‌షాట్‌లను ట్వీట్ చేశారు.