Begin typing your search above and press return to search.

అమెరికా లక్ష మరణాలు.. చైనాకు ట్రంప్ భారీ షాక్

By:  Tupaki Desk   |   25 May 2020 1:30 AM GMT
అమెరికా లక్ష మరణాలు.. చైనాకు ట్రంప్ భారీ  షాక్
X
అగ్రరాజ్యం అమెరికా కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతోంది. గత వారం 50 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేసి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడంతో జనమంతా రోడ్లపైకి వచ్చారు. ఉద్యోగాలు, పరిశ్రమలు.. అన్నీ తెరుచుకున్నాయి. దీంతోపాటు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

ఆదివారం నాటికి అమెరికాలో మొత్తం కేసులు 16.67 లక్షలకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా 4.47 లక్షలమంది మాత్రమే కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1127మంది చనిపోయారు. మొత్తం అమెరికాలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య లక్షకు చేరింది. ఆదివారం నాటికే ఈ సంఖ్య 98700 దాటింది.

లాక్ డౌన్ ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ట్రంప్ తాజాగా రాష్ట్రాల గవర్నర్లకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం షాపులు, ఆబార్షన్ ఆస్పత్రులను తెరిచిన రాష్ట్రాలు ప్రార్థనా మందిరాలను కూడా తెరవాలంటూ గవర్నర్లపై ఒత్తిడి తెచ్చారు. అయితే చర్చిలు, సంఘాలు, మత గురువులు ట్రంప్ తీరును తప్పుపట్టారు. రాజకీయ లబ్ధి కోసం మత విశ్వాసాలను తట్టిలేపొద్దని హితవు పలికారు.

ఇక అమెరికాలో ఇన్ని కేసులు, మరణాలకు కారణమైన చైనాపై ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తాజాగా అమెరికాలో చైనా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. చైనా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకున్న బిలియన్ డాలర్ల అమెరికా పెన్షన్ నిధులను ట్రంప్ ఉపసంహరించారు. 33 చైనా కంపెనీలను, వాటి అనుబంధ సంస్థలను బ్లాక్ చేసేందుకు నిర్ణయించారు. ఈ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి చెందినవి కావడం గమనార్హం.

ఈ నిషేధించిన కంపెనీలన్నీ చైనాలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని.. చైనీస్ ఆర్మీకి సాయం చేస్తున్నాయని.. అందుకే వాటిని నిషేధించబోతున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాబోయే రోజుల్లోనూ చైనాకు గట్టి షాకిచ్చే దిశగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.