Begin typing your search above and press return to search.

యూఎస్‌ వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం 'యూఎస్‌ఏ సెంటర్'‌ !

By:  Tupaki Desk   |   6 March 2021 12:30 PM GMT
యూఎస్‌ వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం యూఎస్‌ఏ సెంటర్‌ !
X
ఇక్కడ చదువు అయిపోయిన తర్వాత , పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాలనుకునే వారి సంఖ్య ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. దీనితో అమెరికా వెళ్లాలనే వారి సందేహాలు తీర్చేందుకు వై -యాక్సిస్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్‌ యూఎస్‌ ఏ సెంటర్‌ ను హైదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌ మ్యాన్‌ శుక్రవారం ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ ను రీఫ్‌ మ్యాన్ ‌తోపాటు, అమెరికా పబ్లిక్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ డేవిడ్‌ కెన్నడీ, వై యాక్సిస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జేవియర్‌ ఆగస్టీన్‌లు ప్రారంభించారు. అమెరికా వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సూచనలు, సలహాలిచ్చేందుకు ఈ సెంటర్ ‌ను ప్రారంభించామని, దేశ వ్యాప్తంగా తమకు 8 నగరాల్లో ఎడ్యుకేషన్‌ సెంటర్లు, మరో 30 మంది సలహాదారులున్నట్లు జేవియర్‌ ఆగస్టీన్‌ తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఇప్పటివరకు ఇక్కడ దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో మూడొంతుల మందికి వీసాలు జారీ చేశామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల గతేడాది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ఆటంకం కలిగిందని.. విద్యార్థులు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తాజాగా స్టూడెంట్‌ వీసా అపాయింట్‌ మెంట్లకు భారీగా డిమాండ్‌ పెరిగిందన్నారు. విద్యార్థులు సకాలంలో క్యాంపస్‌ లలో చేరేందుకు వీలుగా స్టూడెంట్‌ వీసాల జారీకి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. భారత్‌ తో అమెరికా సంబంధాల్లో విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియ వెన్నెముక లాంటిందని పేర్కొన్నారు. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయులేనని చెప్పారు.

ప్రస్తుతం యూఎస్‌ లో 1,93,124 మంది భారత విద్యార్థులు ఉండగా.. అందులో 85 వేల మంది గ్రాడ్యుయేట్, 25 వేల మంది అండర్‌ గ్రాడ్యుయేట్, 81 వేల మంది ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) చేస్తున్నారని వివరించారు. భారత్ ‌లోని ఇతర ప్రాంతాలతో పోల్చితే.. ఏపీ, తెలంగాణ నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూఎస్‌కు వస్తున్నారని చెప్పారు. ప్రతి నాలుగు తెలుగు కుటుంబాల్లో ఒకదానికి యూఎస్‌తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. యూఎస్‌లో 4000కు పైగా కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్నత విద్యకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని కొత్త యూఎస్‌ కాన్సులేట్‌ భవనంలో 54 వీసా ఇంటర్వూ్య విండోలు ఉన్నాయని.. ఎక్కువ మందికి వీసా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడానికి సదుపాయాలు మెరుగుపర్చామని చెప్పారు.