Begin typing your search above and press return to search.

నల్లజాతీయుడి హత్య..అట్టుడుకుతున్న అమెరికా

By:  Tupaki Desk   |   31 May 2020 8:39 AM GMT
నల్లజాతీయుడి హత్య..అట్టుడుకుతున్న అమెరికా
X
అమెరికా అట్టుడుకుతోంది. కొన్ని రోజుల క్రితం మిన్నపొలిస్ లో ‘జార్జ్ ప్లాయిడ్’ అనే నల్ల జాతీయుడిని అమెరికన్ పోలీస్ డెరెక్ చౌవిన్ చంపడంతో ఈ మంటలు అంటుకున్నాయి. అతడి గొంతుపై కాలు పెట్టి కర్కశంగా ఆ పోలీస్ చంపిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అమెరికాలో నల్లజాతీయులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. న్యాయం కోసం రోడ్లమీదకొచ్చి విధ్వంసాలకు దిగుతున్నారు. అమెరికాలో జాత్యంహంకారానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఈ ఉద్యమం విస్తరించింది. ఫ్లాయిడ్ కు న్యాయం జరగాలి.. పోలీస్ కు శిక్ష పడాలి అని ఆందోళనకారులు నినదిస్తున్నారు.

ఘటన జరిగిన మిన్నెపొలిస్ లో శనివారం ఆందోళన అదుపుతప్పింది. కర్ఫ్యూ విధించి , నేషనల్ గార్డ్స్ ను దించినా ఆందోళనకారులు వెనక్కితగ్గలేదు. పోలీసులపై కి రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలను తగులబెట్టారు. పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించి కాల్పులు జరపగా.. ఒకరు మరణించారు. వందల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిన్నెపొలిస్ - సెయింట్ పాల్ నగరాలు తగులబడుతున్నాయి. ఆందోళనలు అదుపుతప్పాయి.

న్యూయార్క్ లో పోలీసులు - నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎఎన్ వార్త సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు.నిరసనలు అదుపు చేసేందుకు అవసరమైతే ఆర్మీని దించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆర్మీకి సైతం ఆదేశాలు జారీ చేశారు.

నల్లజాతీయుడిని చంపిన పోలీస్ డెరెక్ చౌవిన్ పై హత్యానేరం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరిన్ని సెక్షన్లు నమోదు చేశారు. ఇక డెరెక్ భార్య అమాయకుడిని చంపిన తన భర్తకు విడాకులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.