Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికల్లోనూ ఏరులై పారుతున్న డబ్బు .. కాకపోతే అక్కడంతా లెక్క ప్రకారమే!

By:  Tupaki Desk   |   29 Oct 2020 4:15 AM GMT
అమెరికా ఎన్నికల్లోనూ ఏరులై పారుతున్న డబ్బు .. కాకపోతే అక్కడంతా లెక్క ప్రకారమే!
X
మనదేశంలో ఎన్నికలు అంటేనే డబ్బులు వెదజల్లడంలా అయిపోయింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఖర్చును సరాసరిగా చూస్తే మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతారు. డబ్బు, మద్యం ఏరులై పారకపోతే మన దగ్గర ఎన్నికల్లో మజానే ఉండదు. ప్రతి రాజకీయపార్టీ తన స్థాయికి తగ్గట్టుగా నోట్ల కట్టలు వెదజల్లుతూనే ఉంటుంది. ఏ పార్టీ అందుకు అతీతం కాదు. అయితే ఒక్క మనదేశంలోనే కాదు అమెరికాలో కూడా ఎన్నికల్లో డబ్బుదే కీలకపాత్ర. మనదేశంలో ఎన్నికల కమిషన్​ కళ్లు కప్పి.. తప్పడు లెక్కలు చూపించి.. తప్పుడు మార్గాల ద్వారా డబ్బులను తరలిస్తుంటారు. ఇందుకోసం ఆయా రాజకీయపార్టీల కార్యకర్తలు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుంటారు. కానీ అమెరికాలో మాత్రం అలా కాదు. ఏ రాజకీయపార్టీ ఎంత డబ్బైనా ఖర్చుపెట్టుకోవచ్చు. ఎటువంటి పరిమితి ఉండదు.

మనదేశంలో ఎన్నికల ఖర్చుపై ఎన్నికల సంఘం ఓ పరిమితిని విధించింది. మన ఆరితేరిన రాజకీయ నాయకులు ఆ పరిమితిని దాటేసి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఓటుకు రూ. రెండువేల నుంచి ఐదువేల వరకు ఖర్చు పెడుతుంటారు. స్థానికసంస్థల ఎన్నికలైతే ఓటు విలువ మరింత పెరుగుతుంది. రూ. పదివేల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ ఖర్చు కేవలం ఎన్నికల ముందు రోజు జరిగే నోట్ల పంపిణీ మాత్రమే. అంతకు ముందే సభలు, సమావేశాలు, ర్యాలీల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించి ఉంటారు. ర్యాలీకి ఓ వ్యక్తిని తీసుకురావాలంటే సగటున రూ. 500 , మద్యం సీసా, బిర్యానీ కామన్​గా మారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అమెరికాలోనూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు పరిస్థితి కాకపోతే అమెరికాలో అపరిమితంగా ఓ రాజకీయపార్టీ డబ్బును ఖర్చుపెట్టుకోవచ్చు. తప్పుడు లెక్కలు చూపించాల్సిన అవసరమే ఉండదు.

ప్రస్తుత ఎన్నికల్లో మొన్నటి ఆగష్టుకు డెమోక్రాట్ల అభ్యర్ధి జో బైడెన్ కు సుమారు రూ. 7 వేల కోట్ల విరాళాల రూపంలో అందిందట. ఇదే సమయంలో అధ్యక్షుడు, మళ్ళీ ఎన్నికయ్యేందుకు కష్టపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు రూ. 10 వేల కోట్ల విరాళాలు అందాయట. కాకపోతే ట్రంపుకు వచ్చిన విరాళాల్లో ఎక్కువ భాగం ఖర్చయిపోవటంతో ఇబ్బందులు పడుతున్నాడట. నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికల్లో దీని ప్రభావం పడచ్చని అనుకుంటున్నారు. అయితే అక్కడ ఎక్కువగా టీవీ డిబేట్లు, డిన్నర్​ పార్టీల కోసం డబ్బులు వెచ్చిస్తుంటారట. అక్కడ డబ్బుల లెక్క మొత్తం బహిరంగంగానే జరుగుతుంది.