అవన్నీ ప్రమాదాలు కావు.. హత్యలా..?

Tue Jan 22 2019 10:27:42 GMT+0530 (IST)

US hacker claims Gopinath Munde was murdered

ఈవీఎంలను హ్యాక్ చేసి.. అద్భుత రీతిలో విజయాన్ని సాధించే అవకాశం ఉందంటూ దిమ్మ తిరిగిపోయే షాకిచ్చిన సైబర్ నిపుణుడు సుజా మాటల ప్రకంపనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లండన్ లో నిర్వహించిన మీడియా సమావేశాన్ని.. వీడియో కాల్ తో చేపట్టిన ఆయన.. పలు విస్మయకర విషయాల్ని వెల్లడించారు.ఆయన చెప్పిన మాటల్లో నిజం ఎంత? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసేలా.. పొద్దుపొద్దున్నే దిమ్మ తిరిగిపోయేలా ఆయన చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ ఆయన ఆరోపణలు చేస్తూనే.. ఈ విషయం తెలిసిన ప్రముఖులు హత్యకు గురయ్యారంటూ మరో బాంబు పేల్చారు.

ఇప్పటివరకూ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ప్రముఖ నేతల మరణాల వెనుక అసలు కారణం.. వారికి ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం తెలుసంటూ సుజా చేసిన ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపే అవకాశం ఉందని చెప్పకతప్పదు. మోడీ మంత్రివర్గంలో పని చేసిన గోపీనాథ్ ముండేకు ఈవీఎంలను హ్యాక్ చేసే విషయం తెలుసని.. అందుకే ఆయన్ను రోడ్డు ప్రమాదం పేరుతో హత్య చేసినట్లుగా వెల్లడించారు. అంతేకాదు..ఈ ఉదంతంపై దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారి తంజీల్ అహ్మద్ కీలక ఆధారాల్ని సేకరించటంతో ఆయన్ను హత్య చేసినట్లుగా చెప్పారు.

ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేది హత్య అన్న విషయానికి సంబంధించి ఆధారాలు సేకరించిన అధికారి.. అదే విషయంపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయటానికి సిద్ధమవుతున్న వేళలో ఆయన్ను హత్య చేశారన్నారు. అంతేకాదు.. ఈ విషయాలన్నీ ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కు తాము చెప్పామని.. ఆమె ఆ విషయాల్ని భారత్ లోనూ వెల్లడించేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆమెను చంపేశారన్నారు.

అంతేకాదు.. టీవీ చర్చల్లో పెద్దగా అరుస్తూ పాల్గొనే ఒక జర్నలిస్ట్ కు ఇదే విషయాన్ని చెప్పామని.. ఆయన తమ మాటల్ని అస్సలు పట్టించుకోలేదన్నారు. ఈ నిజాలు తెలిసిన తమ బృందం మీదా దాడులు జరిగినట్లుగా ఆయన వెల్లడించారు. ఇన్ని తీవ్ర ఆరోపణల నేపథ్యంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఎలా రియాక్ట్ అవుతుంది?  సుజా చేసిన ఆరోపణలపై ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.