Begin typing your search above and press return to search.

అమెరికా ఎన్నికలు: భారతీయుల వైపే అందరి చూపు!

By:  Tupaki Desk   |   31 Oct 2020 1:30 PM GMT
అమెరికా ఎన్నికలు: భారతీయుల వైపే అందరి చూపు!
X
అమెరికా ఎన్నికల వేళ భారతీయులు కీలకంగా మారారు. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఇండో-అమెరికన్ కమలా హ్యారిస్ ఉండడం విశేషంగా చెప్పవచ్చు.

అధ్యక్ష రేసులో ఉన్న రిపబ్లికన్, డెమొక్రటిక్ అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జోబిడెన్ శిబిరాలు ఇప్పుడు నిత్యం భారతీయుల జపం లేకపోతే రోజు గడవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రెండు బ్యాచుల్లో సలహాదారులు, సాంకేతిక నిపుణులు భారతీయులే కావడం విశేషం. వీరంతా ఇప్పుడు వారి క్యాంపుల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

భారతీయ నేపథ్యం ఉన్న వారు అమెరికాలో పలు రాష్ట్రాలకు గవర్నర్లుగా కూడా పనిచేశారు. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో ఫలితాలను నిర్ధేశించే స్థాయిలో భారతీయులు ఉండటం మనకు ఎంతో గర్వకారణంగా నిలుస్తోంది.

అమెరికాలో మొత్తం భారతీయుల జనాభా 4.16 మిలియన్లుగా ఉంది. ఇందులో 2.6 మిలియన్ల మంది అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. ట్రంప్, జోబిడెన్ ప్రయత్నాలతో భారతీయులు సైతం గ్రూపులుగా విడిపోయి ఎన్నికలను ప్రభావితం చేసే వర్గాలుగా మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద రాష్ట్రాలే కీలకం. వీటినే బ్యాటిల్‌ గ్రౌండ్‌ రాష్ట్రాలుగా అమెరికాలో పిలుస్తారు. ఫ్లోరిడా, మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లో మెజారిటీ సాధించాలంటే భారతీయుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడం తప్పనిసరని ట్రంప్, జోబిడెన్ భావిస్తున్నారు. అందుకే అక్కడ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య 2016 అధ్యక్ష ఎన్నికల్లో విజేతల మెజారిటీని మించి ఉంది. దీంతో అధ్యక్ష పీఠం కోసం భారతీయుల మద్దతు తప్పనిసరిగా మారింది.

ఐఏఎఎస్ తాజా సర్వే ప్రకారం.. నమోదైన ఓటర్లలో 72శాతం మంది భారతీయులు డెమొక్రట్ అభ్యర్తి జోబిడెన్ కూ.. 22శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కు ఓటు వేసే అవకాశముందని తెలిపింది. ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన హెచ్1బీ వీసాలు, ఆంక్షలు, విదేశీయులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో భారతీయులు ఆయనకు ఓటు వేసే పరిస్థితి లేదంటున్నారు.