Begin typing your search above and press return to search.

అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం చెక్.. ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   25 Jun 2022 4:31 AM GMT
అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం చెక్.. ఇప్పుడేం జరగనుంది?
X
అగ్రరాజ్యం అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి యూఎస్ లో వ్యక్తిగత స్వేచ్ఛకు క్వశ్చన్ మార్కు తగిలేలా ఒక సంచలన తీర్పును ప్రకటించింది అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం. గడిచిన యాభై ఏళ్లుగా అమెరికన్లకు హక్కుగా ఉన్న దాన్ని తొలగిస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అబార్షన్ హక్కుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. యాభై ఏళ్లుగా అమల్లో ఉన్న అబార్షన్ హక్కును రద్దు చేయటం.. రాజ్యాంగం ఈ హక్కును ఇవ్వలేదంటూ సుప్రీం పేర్కొంది.

దీంతో.. అబార్షన్లను నియంత్రించేందుకు వీలుగా రాష్ట్రాలు తమకు తోచిన రీతిలో చట్టాలు చేయొచ్చని స్పష్టం చేసింది. ఈ చారిత్రక తీర్పుతో అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘రాజ్యాంగం అబార్షన్ హక్కును ఇవ్వలేదు. ఆ కేసులో (రో.. కేసీ వాజ్యం)ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’ అని పేర్కొంది. 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలు అబార్షన్లు చేయించుకోవటాన్ని రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ.. అప్పట్లో తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు.

తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో.. ఆ తీర్పు చెల్లుబాటు కాని పరిస్థితి నెలకొంది. రో - కేసీ కేసులో సుప్రీం తీర్పు పుణ్యమా అని అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి. ఇటీవల కాలంలో నియంత్రణ లేనట్లుగా సాగుతున్న అబార్షన్లకు చెక్ పెట్టటం.. ఇవి మహిళల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయన్న వాదనను కొందరు వినిపిస్తూ పోరాడుతున్నారు. తాజా తీర్పు అలాంటి వారి వాదనలకు పెద్ద పీట వేసిందని చెప్పాలి.

సుప్రీంకోర్టు ప్రకటించిన తాజా తీర్పుపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు హర్షం వెళ్లుబుచ్చుతుంటే.. మరికొందరు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వందలాది అమెరికన్లు.. సుప్రీంకోర్టు ఎదుట గుమిగూడారు. దీంతో భద్రతను రెట్టింపు చేశారు. ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కాసేపటికే దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో దాదాపు 25 రాష్ట్రాలకు పైనే అబార్షన్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించాయి. ఇందులో మిస్సోరి స్టేట్ అబార్షన్లపై సుప్రీం వెలువరించిన తీర్పు వెంటనే.. దాన్ని తమ రాష్టంలో అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పలువురు అమెరికన్లు మాత్రం తీవ్రంగా ఫీల్ అవుతున్నారు. తమ వ్యక్తిగత జీవితాల్లో చొరబడుతున్నారన్నారు.

మరోవైపు ఇలాంటి వాదనలకు బలం చేకూరేలా దేశాధ్యక్షుడు బైడెన్ సైతం స్పందించారు. ‘ఈ రోజు బ్యాడ్ డే. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ హక్కును ఉల్లంఘించింది. ఈ తీర్పుతో మహిళల ఆరోగ్యం.. జీవితం ప్రమాదంలో పడింది అని పేర్కొన్నారు. అధ్యక్షుల వారు వ్యతిరేకించే అంశానికి అధికార రంగు పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.