Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్యాంక్ వివ‌రాలు లీక్‌

By:  Tupaki Desk   |   24 May 2020 6:01 AM GMT
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్యాంక్ వివ‌రాలు లీక్‌
X
అమెరికా అధ్యక్షుడు డొన‌ల్డ్ ట్రంప్‌కు సంబంధించిన బ్యాంక్ వివ‌రాలు బ‌హిర్గ‌తమ‌య్యాయి. ప్రైవేటు బ్యాంకుకు సంబంధించిన‌ సమాచారం బయటకు వచ్చింది. అయితే ఇది శ్వేత‌భ‌వ‌నం కార్య‌ద‌ర్శి చేసిన పొర‌పాటు వ‌ల‌న లీకైంది. లీకైన వివ‌రాల్లో ట్రంప్‌కు సంబంధించిన అన్ని వ్య‌క్తిగ‌త వివ‌రాలు ఉండ‌డంతో కొంత సంచ‌ల‌నంగా మారింది.

మ‌హ‌మ్మారి వైరస్ ప్ర‌బ‌ల‌డంతో అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్ (హెచ్‌హెచ్ఎస్‌) విభాగానికి తన 3 నెలల జీతాన్ని డొన‌ల్డ్ ట్రంప్ విరాళంగా ప్రకటించారు. దానికి సంబంధించి శుక్రవారం వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి కైలీ మెక్‌ ఎనానీ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా త‌మ అధ్యక్షుడు ట్రంప్ హెచ్‌హెచ్ఎస్ విభాగానికి మూడు నెలల వేతనం విరాళంగా ప్రకటించినట్లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా దానికి సంబంధించిన ఒక చెక్కు‌ను చూపించారు. ఈ స‌మ‌యంలో ఒక పొరపాటు జ‌రిగింది.

మూడు నెలల వేతనానికి సంబంధించిన చెక్కుతో పాటు, లక్ష అమెరికన్‌ డాలర్ల నగదు రాసి ఉన్న మరో చెక్కును ఆమె చూపించారు. దానిలో ట్రంప్ పేరు, సంతకం మాత్రమే కాకుండా ట్రంప్‌ చిరునామాతోపాటు పూర్తి వివరాలు ఉన్నాయి. ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అధ్యక్షుడి ప్రైవేటు బ్యాంకు సమాచారం బయటకు రావ‌డం శ‌త్రువులు, హ్యాక‌ర్లు త‌స్క‌రించే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. అగ్ర‌రాజ్యం అధ్య‌క్షుడు కావ‌డంతో శ‌త్రు దేశాలు దీన్ని పావుగా వాడుకునే ప్ర‌మాదం కూడా ఉంది. ఈ సంద‌ర్భంగా వైట్ హౌస్ దిద్దుబాటు చ‌ర్య‌లు కూడా చేప‌ట్టింది. అయితే ఈ వ్య‌వ‌హారంపై ఆమెపై చ‌ర్య‌లు తీసుకునే ఆస్కారం ఉంది. ఈ వ్య‌వ‌హారాన్ని వైట్‌హౌస్ సాధార‌ణ విష‌యంగా కొట్టిపారేసింది.