యూపీ ఎన్నికలు: సీఎం అభ్యర్థిగా ప్రియాంక

Tue Sep 14 2021 09:24:45 GMT+0530 (IST)

UP elections: Priyanka as CM candidate

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. మరికొన్ని నెలల్లోనే జరుగనున్న ఈ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ అప్పుడే సన్నద్ధమవుతున్నాయి. బీజేపీ ఇప్పటికే మెజార్టీ కేంద్రమంత్రులను యూపీ నుంచే తీసుకుంది. సీఎం యోగి సహా నేతలంతా యూపీపై ఫోకస్ చేశారు. ఎస్పీ బీఎస్పీలు జట్టుకట్టి ఈసారి తీవ్రంగా పోరాడుతున్నాయి.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒంటరిగా పోటీచేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈసారి ప్రియాంకగాంధీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఆమెనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక పేరును ప్రకటించే అవకాశాలున్నాయని సల్మాన్ ఖుర్షీద్ తాజాగా సంచలన విషయాలు తెలిపారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు.

యూపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రియాంక ఎంతో కష్టపడుతోంది. పోయిన సారి ప్రతి ఊరు వాడ తిరిగి దళితులు బీసీల ఇళ్లలోకి వెళ్లి భోజనం చేస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎంతో కష్టపడ్డారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు మాత్రం పడలేదు.

ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. కూటమి కట్టలేదు. కాంగ్రెస్ తో వచ్చేవారిని ఆహ్వానిస్తూ ముందుకెళుతున్నారు. ప్రియాంకను కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ గా చేయాలని అధిష్టానం పెద్దలు డిసైడ్ అయ్యారు.

వచ్చే ఏడాది ఆరంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలిచి సత్తా చాటింది. సమాజ్ వాదీ పార్టీ 47 బీఎస్పీ 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ కేవలం 7 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది.

అయితే ఈసారి ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. ఇక అధికారంలో ఉన్న బీజేపీ కూడా యోగినే మళ్లీ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి ముందుకు వెళుతోంది. మరి ఎవరిది పైచేయి అవుతుందనేది వేచిచూడాలి.