Begin typing your search above and press return to search.

యూటర్న్ జగన్... ?

By:  Tupaki Desk   |   24 Nov 2021 1:30 AM GMT
యూటర్న్ జగన్... ?
X
అవునా అంటే ఎస్ అనాల్సి వస్తోంది మరి. ఒకనాడు ఈ పేరు చంద్రబాబుకు పెట్టి వైసీపీ నేతలు ఒక ఆట ఆడుకున్నారు. అయితే జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటూనే చాలా విషయాల్లో ఈజీగా మడమ తిప్పేస్తున్నారు. జగన్ మూడు రాజధానుల చట్టం విషయంలో వెనక్కి తగ్గుతాడని ఎవరూ అసలు ఊహించలేదు. అది వ్యూహమైనా లేక మరే కారణాలు ఉన్నా కూడా జగన్ మూడు రాజధానులు ఇక రద్దు అంటూ సభలో ఆమోదించడం అంటే విడ్డూరంగానే చూస్తున్నారు. అంతటితో అయిపోలేదు కధ.

ఇపుడు ఏకంగా శాసనమండలి రద్దును కూడా వద్దు అనుకుంటున్నారు. ఇది 2020 జనవరి 27న హడావుడిగా అసెంబ్లీని పెట్టి మరీ ఆమోదించారు. నాడు శాసనమండలి దండుగ అని ఇదే జగన్ అన్నారు. దాని కోసం పెట్టే వ్యయం కూడా వేస్ట్ అనేశారు. అసెంబ్లీలో విద్యావంతులు, మేధావులు ఉన్నారని అందువల్ల శాసన మండలి అవసరం ఉండదని లాజిక్ పాయింట్ కూడా తీశారు.

సీన్ కట్ చేస్తే గట్టిగా రెండేళ్ళు తిరగకుండానే మండలి రద్దు వద్దు అంటూ తీర్మానం చేశారు. లేఖను వెనక్కి తీసుకోవాలని కోరుతూ అదే మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సభలో తీర్మానం పెట్టారు. దీని మీద బుగ్గన వారి లేటెస్ట్ మాట ఏంటి అంటే తాము మండలి వద్దు అనుకున్నామని, కేంద్రం మాత్రం దీన్ని పెండింగులో పెట్టిందని పేర్కొన్నారు. అందువల్ల తాము మండలి రద్దు వద్దు అని ఇపుడు అనుకుంటున్నట్లుగా సభకు తెలిపారు. ఇది బాగానే ఉంది కానీ ఇపుడు మండలి ఎందుకు కావాలీ అంటే వైసీపీకి అక్కడ ఫుల్ మెజారిటీ వచ్చేసింది. ఇక మీదట అన్ని బిల్లులూ ఈజీగా పాస్ అవుతాయి. అందుకే మండలి ఇపుడు కావాలి అన్న ఫక్తు రాజకీయ విధానమే వైసీపీది అన్న విమర్శలు వస్తున్నారు.

మరి మండలి రద్దు అన్నది విధానపరమైన నిర్ణయం అని ఎందుకు ఇన్నాళ్ళూ చెప్పుకొచ్చారు అన్నదే ఇక్కడ ప్రశ్న. కేంద్రం మండలి రద్దు తీర్మానాన్ని పెండింగులో పెట్టింది అంటున్నారు. అయితే ఈ రెండేళ్లలో కరోనా వల్ల సభలు కూడా సరిగ్గా జరగలేదు కదా. మరి నిజంగా మండలి వద్దు అన్న చిత్తశుద్ధే ఉంటే కచ్చితంగా కేంద్రం మీద వత్తిడి తెచ్చి రద్దు చేయించుకోవచ్చు కదా. కానీ విషయం అది కాదు, ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న వ్యవహారం. పైగా ఏపీలోని అన్ని లోకల్ బాడీస్ లోనూ అసెంబ్లీలోనూ వైసీపీకి పూర్తి మెజారిటీ ఉంది. వరసబెట్టి ఎమ్మెల్సీస్ వారే అవుతారు. అందుకే ఇపుడు మండలి ముద్దుగా ఉందన్న కామెంట్స్ పడుతున్నాయి. ఏది ఏమైనా కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక సంచలన నిర్ణయాల విషయంలో జగన్ యూ టర్న్ తీసుకుని బాబు కంటే తాను ఎక్కడా తక్కువ తినలేదు అనిపించారు అంటున్నారు. మొత్తానికి మాట తప్పం, మడమ తిప్పం అన్న మాటలు ఇక మీదట కుదరవేమో అన్న సెటైర్లు విపక్షాల నుంచి పడుతున్నాయి.