ఫ్లైటే కాదు.. ట్రంప్ కారు.. హెలికాఫ్టర్ లెక్కే వేరు

Thu Feb 20 2020 09:50:45 GMT+0530 (IST)

U.S. President Donald Trump helicopter

అమెరికా అధ్యక్షుడు అన్నంతనే ఆ పెద్ద మనిషి ప్రయాణించే విమానం (ఎయిర్ ఫోర్స్ వన్) గురించి.. దాని గొప్పతనం గురించి.. సాంకేతికంగా అదెంత అద్భుతమో తరచూ చెబుతుంటారు. ప్రపంచానికే పెద్దన్న రాజ్యానికి అధినేతగా ఉన్న వ్యక్తి ప్రయాణించే విమానమే కాదు.. ఆయన చిన్నపాటి దూరాలకు ప్రయాణించే హెలికాఫ్టర్.. ఆయన ప్రయాణించే కారు గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.మరో నాలుగు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు వస్తున్న వేళ.. ఆయన ప్రయాణించే వాహనాల మీద ఆసక్తికర చర్చ మొదలైంది. అందరూ చెప్పుకునే ఎయిర్ ఫోర్స్ వన్ విశేషాల పుట్ట అయితే.. అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో హెలికాఫ్టర్.. కార్లు ఉండటం గమనార్హం.

అత్యాధునిక సాంకేతికత తో ఉండే ఈ హెలికాఫ్టర్ ను మెరైన్ వన్ గా వ్యవహరిస్తారు. అధ్యక్షుల వారు ఏ దేశానికి వెళ్లినా.. దాన్ని తీసుకొస్తారు. విదేశీ పర్యటనల్లో చిన్న చిన్న దూరాలకు.. అధ్యక్షుల వారు బస చేసే హోటల్ లోకి వెళ్లటానికి ఈ హెలికాఫ్టర్ ను వినియోగిస్తారు. ఈ హెలికాఫ్టర్లు ఎంత శక్తివంతమైనవంటే.. క్షిపణి దాడుల్ని సైతం తట్టుకోగలవు. వీహెచ్ 3డీ సీ కింగ్ లేదంటే వీహెచ్ 60ఎన్ వైట్ హాక్ హెలికాఫ్టర్లను అధ్యక్షుడి ప్రయాణానికి వాడతారు.

ఈ హెలికాఫ్టర్ లో అధ్యక్షుల వారు ప్రయాణించే సమయం లో ఒకేసారి ఒకేలాంటి ఐదు హెలికాఫ్టర్లు వెళుతుంటాయి. అందులో ఒక దాన్లో అధ్యక్షుల వారు ఉంటారు. మిగిలిన నాలుగు అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే హెలికాఫ్టర్ కు రక్షణగా వెళతాయి. అధ్యక్షుడు ఎటు వెళుతున్నారన్న విషయం ఐదు హెలికాఫ్టర్లు ఒకదానితో ఒకటి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే సాంకేతికత వీటి సొంతం.

అమెరికా అధ్యక్షుడు ఎక్కడకు వెళ్లినా..ఆయన ప్రయాణించేందుకు వీలుగా వాడే కారును బీస్ట్ గా పిలుస్తారు. మూడు రోజుల తర్వాత భారత్ కు రానున్న ట్రంప్.. ఈ వాహనంలోనే ప్రయాణించనున్నారు. ఒబామా అధ్యక్షుడిగా వ్యవహరించిన వేళలోనే ఈ కారును తొలిసారి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కారును కాడలిక్ 1 అని కూడా వ్యవహరిస్తుంటారు.

ప్రపంచంలో అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉన్న ఏకైక కారుగా చెబుతారు. ఇలాంటి బీస్ట్ కార్లు పన్నెండుఅధ్యక్షుడు వెళ్లే కాన్వాయ్లో ఉంటాయి. ఐదు అంగుళాల మందం కలిగిన స్టీల్.. అల్యూమినియం.. టైటానియం.. సిరామిక్స్ తో తయారు చేశారు. దాడి జరిగితే కారు కిటికీ అద్దాలు తట్టుకోవటమే కాదు.. అవసరమైతే బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తాయని చెబుతారు. ఈ కారుపక్కనే బాంబు పేలినా లోపల ఉన్న వారికి ఏమీ కాదు. జీవరసాయన దాడుల నుంచి తట్టుకునే సౌకర్యం ఈ కారు సొంతం.

అమెరికా అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా కారులో కూర్చొని ఉపాధ్యక్షుడి తో మాట్లాడేందుకు వీలుగా శాటిలైట్ ఫోన్ నిత్యం అందుబాటు లో ఉంటుంది. రాత్రిపూట ప్రయాణం లో కనిపించే నైట్ విజన్ కెమెరాలు.. గ్రనేడ్ లాంచర్స్.. ఆక్సిజన్ అందించే ఏర్పాటుతో పాటు..అధ్యక్షుడి గ్రూపు రక్తం లాంటి సౌకర్యాలెన్నో ఉంటాయి. ఈ కారును అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో.. 180 డిగ్రీల్లో కారుని తిప్పటం లాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా ఈ కారు డ్రైవర్ కు ట్రైనింగ్ ఇస్తారు. అమెరికా సీక్రెట్ సర్వీసు లో పని చేసే వారికి మాత్రమే కారు నడిపే అవకాశం ఉంటుంది.